Apr 29,2023 22:59

ధర్నాలో మాట్లాడుతున్న జిల్లా ఛైర్మన్‌ సంగీతరావు

ప్రజాశక్తి-గుంటూరు : గ్రామ వార్డు సచివాలయాలు మానస పుత్రికలు అని చెప్పుకుంటూ, అందులో పని చేసే ఉద్యోగులపై సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి శీతకన్ను వేశారని ఏపీజేఏసీ అమరావతి నాయకులు విమర్శించారు. జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా శనివారం చేపట్టిన నిరసనల్లో భాగంగా గుంటూరు కలెక్టరేట్‌ వద్ద సచివాలయ ఉద్యోగులు శనివారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అసోసియేట్‌ ప్రెసిడెంట్‌, కో-ఆపరేటివ్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఫణి పేర్రాజు, జిల్లా చైర్మన్‌ కె.సంగీతరావు, జనరల్‌ సెక్రటరీ కిరణ్‌ కుమార్‌ మాట్లాడారు. ఉద్యోగం సాధించామని ఆనందపడాలో, ఇక్కడ ఎదురవుతున్న ఇబ్బందులను పట్టించుకునే వారులేరని ఆవేదన చెందాలో అర్థంకాని స్థితిలో సచివాలయ సిబ్బంది ఉన్నారన్నారు. బదిలీల్లేక కుటుంబానికి దూరంగా బతకలేక సచివాలయ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. విమెన్‌, వీకర్స్‌ సెక్షన్‌, ప్రొటెక్షన్‌ సెక్రటరీలు హోం శాఖకు వెళ్లాలా..? లేదా..? అనే విషయాన్ని వారికే ఆప్షన్‌ ఇవ్వాలని కోరారు. ఏపీజీఎల్‌ బాండ్లు, తొమ్మిది నెలల కాలానికి జీతం బకాయిలు, ప్రాన్‌ ఖాతాల్లో తొమ్మిది నెలల పెన్షన్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ధర్నాలో వివిధ సంఘాల నాయకులు బి.విజరుకుమార్‌, ఎన్‌.వి.కష్ణారావు, దత్తు, సురేష్‌ నాయుడు, సిహెచ్‌ వెంకటేశ్వర్లు, ఎస్‌.కొండయ్య, పి.నాగరాజు, పాల్గొన్నారు.