Sep 01,2023 00:53

ప్రజాశక్తి-గుంటూరు : ప్రభుత్వం నూతనంగా రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో ప్రవేశపెట్టిన కార్డ్‌ ప్రైమ్‌ 2.0 విధానం ఉపసంహరించుకోవాలని కోరుతూ దస్తావేజు లేఖరులు చేపట్టిన ఆందోళన రెండో రోజూ కొనసాగింది. గురువారం సబ్‌ రిజిస్ట్రార్‌కు, జిల్లా రిజిస్ట్రార్‌కు, అనంతరం జెడ్పీ ప్రాంగణంలోని రిజిస్ట్రేషన్‌ శాఖ డిఐజికి దస్తావేజు లేఖరులు వినతిపత్రం అందజేశారు. తొలుత కలెక్టరేట్‌ ఎదుట పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. గుంటూరు జిల్లా ఆర్‌ఒ దస్తావేజు లేఖరుల అధ్యక్షులు ఆళ్ల రామిరెడ్డి, సంఘం గౌరవాధ్యక్షులు మునగాల రవి మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రైమ్‌ 2.0 విధానం లోపభూయిష్టంగా, ప్రజలను అవస్థలకు గురి చసే విధంగా ఉందని అన్నారు. నూతన విధానంలో ఆస్తి హక్కు కలిగిన వ్యక్తి ఒరిజినల్‌ రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లు లేకుండా ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లతో బ్యాంకు రుణాలు పొందాలన్నా, క్రయ విక్రయాలు జరపాలన్నా అనేక ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందన్నారు. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లను నకిలీ డాక్యుమెంట్లుగా సృష్టించేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పారు. ఇప్పటి వరకూ కొనసాగుతున్న పాత రిజిస్ట్రేషన్‌ విధానంలో ఆస్తి క్రయ విక్రయాలు సాఫీగా సాగుతుండగా నూతన విధానంలో బయోమెట్రిక్‌ వినియోగం వల్ల నూతన టెక్నాలజీ సాయంతో యజమాని ఆస్తిని అక్రమార్కులు తీసుకునే ప్రమాదం ఉందన్నారు. ఈ-పేమెంట్‌ ద్వారా స్టాంప్‌ డ్యూటీ ఆన్‌లైన్‌ చెల్లింపుల ద్వారానే చేయాలనే నిబంధనల నిరక్షరాస్యులకు శాపంగా మారుతుందన్నారు. రిజిస్ట్రేషన్‌ సమయంలో ప్రజలకు సహాయకారులుగా ఉంటున్న లక్షలాది దస్తావేజు లేఖరుల కుటుంబాలు రోడ్డున పడతాయని, పాత పద్ధతినే కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో పి.గోవర్థన్‌, మెహమూద్‌, ఆర్‌.రాము, ఎ.సుధాకర్‌, కె.ప్రసాద్‌, కె.శ్రీనివాస్‌, ఎస్‌.మహేష్‌బాబు పాల్గొన్నారు.
ప్రజాశక్తి - మంగళగిరి : రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తెచ్చిన కార్డు ప్రైమ్‌ 2.0ను వ్యతిరేకిస్తూ దస్తావేజు లేఖర్లు చేపట్టిన పెన్‌డౌన్‌ రెండోరోజైన గురువారం కొనసాగింది. ఆందోళనకు సిపిఎం సీనియర్‌ నాయకులు జెవి రాఘవులు, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరపతయ్య మద్దతు తెలిపారు. టి.తిరుమలరావు, యు.భవాని, టి.ప్రవీణ్‌ కుమార్‌, ఎం.ప్రకాష్‌ పాల్గొన్నారు.
ప్రజాశక్తి-తెనాలి :  రాష్ట్ర దస్తావేజు లేఖర్ల సంఘం పిలుపుమేరకు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద నిరసన కొనసాగింది. సంఘం నాయకులు మాట్లాడుతూ నూతన విధానంతో కొనుగోళ్లు, అమ్మకాలు చేపట్టేవారికి తీవ్ర నష్టాన్ని చేకూరుస్తుందన్నారు. దస్తావేజు లేఖర్లుగా, స్టాంపు వెండర్లుగా, డిటిపి ఆపరేటర్లుగా జీవనాన్ని కొనసాగిస్తున్న వేలాది మంది ఉపాధి కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్‌.ఆంజనేయులు, వి.రామలింగాచారి, ఎన్‌.రాంబాబు, వై.పేరయ్య, జి.రాంబాబు, సీహెచ్‌ ప్రసాద్‌, వై.రవికుమార్‌, జి.ద్వారకాశ్రీను, ఎం.రాజేంద్రబాబు, టి.శ్రీధర్‌, బి.సురేష్‌ పాల్గొన్నారు.