
ప్రజాశక్తి -కోటవురట్ల:మండలంలోని బికే పల్లి, ఎండపల్లి గ్రామాల్లో బుధవారం జిల్లా కలెక్టర్ రవి సుభాష్ పఠన్ శెట్టి సందర్శించారు. ప్రధానంగా ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర భూ సర్వే లో భాగంగా రెండో విడత బికేపల్లి గ్రామంలో జరుగుతున్న సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు అందజేయాల్సిన 9(2) నోటీసులు సక్రమంగా సవివరంగా లేకపోవడం పట్ల సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు. సర్వే పనితీరు, భూమి కొలతలు ఎక్కువ, తక్కువలపై రైతులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో జగనన్న కాలనీ ఇల్లు నిర్మాణంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొంతమంది లబ్ధిదారులకు కేటాయించిన స్థలం గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండడంతో నిర్మించేందుకు ఎవరు ముందుకు రాలేదని పలువురు తెలిపారు. సొంత స్థలాలలో ఇల్లు నిర్మాణాలు చేసుకుంటున్నారని, కొంతమందికి ఇళ్ల స్థలాలు లేక నిర్మాణాలు చేపట్టలేదన్న విషయం కలెక్టర్ దృష్టికి గ్రామ నాయకులు తీసుకువెళ్లారు. గ్రామంలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఇంటి స్థలాలు కొనుగోలు చేసి లబ్ధిదారులకు అందజేసే విధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. మండలంలో జరుగుతున్న ఉపాధి పనులు, వేతనాలు, సౌకర్యాలపై ఆరా తీశారు. ఉపాధి కూలీలకు సౌకర్యాలు కల్పించాలని ఎంపీడీవోకు సూచించారు. అనంతరం ఆయన అంగన్వాడి కేంద్రాలను సందర్శించి చిన్నారులకు అందజేస్తున్న పౌష్టికాహార వివరాలు, వసతి సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో మూడు అంగన్వాడీ భవనాలు అద్దె గదుల్లో కొనసాగుతున్న విషయం కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం చిన్నారులతో కాసేపు ముచ్చటించారు. గ్రామంలో చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు అడిగి తెలుసుకున్నారు. తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. అనంతరం ఎండపల్లి గ్రామాన్ని సందర్శించిన ఆయన గ్రామంలో అక్రమంగా ఏర్పాటు చేసిన లేఔట్‌ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనుమతులు లేకుండా ఏర్పాటు చేస్తున్న లేఅవుట్‌పై సమగ్ర విచారణ చేపటతామన్నారు.
అనంతరం ఆయన స్థానిక విలేకరులతో కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ఇంతవరకు తొలి విడత 143 గ్రామాలకు సర్వే నిర్వహించగా, మలివిడత 220 గ్రామాలలో సర్వే చేపడుతునామని తెలిపారు. సర్వేలో చిన్న చిన్న పొరపాట్లు జరిగిన విషయం వాస్తవమేనని. మలివిడత అటువంటి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో అర్హులందరికీ ఇల్లు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి వెంకట జయరాం, తహసిల్దార్ జానకమ్మ, ఎంపీడీవో చంద్రశేఖర్, డిప్యూటీ తహసిల్దారు సోమశేఖర్, పిఆర్ ఇంజనీర్ వర్మ, హౌసింగ్ ఇంజనీరు జగదీశ్వరరావు, ఆర్‌బ్ల్యూఎస్ ఇంజనీర్ కరుణ, గ్రామ సర్పంచ్ లింగన్న నాయుడు, ఎంపీటీసీ సభ్యులు రాంబాబు పాల్గొన్నారు.