ప్రజాశక్తి-పాడేరు:మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన పాడేరు మండలం జామిగూడ, పెదబయలు మండలం బూసిపుట్టు పంచాయతీ పలు గ్రామాలలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ శనివారం సుడిగాలి పర్యటన చేశారు. ముంచింగిపుట్టు ప్రధాన కేంద్రంలో ఇద్దరు వ్యక్తులు అనుమతి లేని యాప్‌తో రైతులకు రిజిస్ట్రేషన్ చేయడం గమనించి వారిపై తగు చర్యలు తీసుకోవాలని స్థానిక ఎస్సైను ఆదేశించారు. ముంచింగిపుట్ట నుంచి బూసి పుట్టు చేరుకున్న కలెక్టర్ 104 వాహనం ద్వారా అందిస్తున్న సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, 104 వాహనం తిరిగే షెడ్యూల్ను ముందుగానే గ్రామస్తులకు తెలియజేయాలని సూచించారు. స్కానింగ్ అవసరమైతే గర్భిణీలు ముంచింగిపుట్టు సామాజిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లాలని, అవసరమైన పరికరాలతో పాటు శిక్షణ పొందిన డాక్టర్ ఉన్నారని తెలిపారు. జామిగూడ గ్రామంలో సందర్శించిన కలెక్టర్‌న బ్రిడ్జి నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించి మార్చి నాటికి పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కొజ్జారిగూడ, జాడిగూడ, గుంజువాడ, తారకి, జామిగూడ, పిన రావిల్లిలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు ఉపాధ్యాయులు వారానికి ఒక్కరోజే వచ్చి వెంటనే వెళ్ళి పోతున్నారని ఆయా గ్రామస్తులు చేసిన ఫిర్యాదు మేరకు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓ, ఏ టి డబ్ల్యూఓలు సోమవారం వ్యక్తిగతంగా కలవాలని ఆదేశించారు. కొజ్జారిగూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు మనబడి నాడు నేడు ఫేజ్ 1 కింద 18 లక్షలు మంజూరు కాగా ఎటువంటి పనులు చేపట్టలేదని సర్పంచ్, ఎంపీటీసీ, తదితరులు ఇచ్చిన ఫిర్యాదుతో పూర్తి నివేదిక అందజేయాల్సిందిగా ట్రైబల్ వెల్ఫేర్ ఇఇ ని ఆదేశించారు. కొజ్జారిగూడ గ్రామంలో అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి అక్టోబర్ నెలకు సరపరా అయిన పాలు, గుడ్లు, ఇతర రేషన్ అర్హుల ఇంటికి అందించాలని, నవంబర్ నెల కోటాను ఇండ్లకు అందించాలని ఆదేశించారు. జామిగూడ పంచాయతీ పరిధి 14 గ్రామాల్లో 11 గ్రామాలకు 56 లక్షలతో జలజీవన్ మిషన్ కింద నీటి సరఫరా పనులు మంజూరయ్యాయని, ఇందులో మిగిలిన నిధులతో మిగిలిన మూడు గ్రామాలకు నీటి సరఫరా పథకాలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ఒక ఇంటి బయట ఉన్న వంతల బొజ్జయ్య దీనమైన ఆరోగ్య పరిస్థితిని గమనించిన కలెక్టర్ అతనికి కావలసిన సహాయం అందించాలని ఆదేశించారు. బూసిపుట్టు గ్రామ సచివాలయ భవనం కాంట్రాక్టర్ పనులు ప్రారంభించక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ సదరు కాంట్రాక్ట్‌ను రద్దు చేయడంతో పాటు, అతనికి అప్పగించిన మిగిలిన కాంట్రాక్టులను కూడా రద్దుచేసి వేరొకరి తో పూర్తి చేయించాలని ఆదేశించారు. జామి గూడ నుంచి ఆంధ్ర, ఒడిశా బోర్డర్ వరకు సరైన రహదారి సౌకర్యం లేనందున కొంత దూరం జీపులో వెళ్లి సర్పంచ్‌తో ద్విచక్ర వాహనంపై ప్రయాణించి రోడ్డు పరిస్థితిపై ఆరా తీశారు. ఈ పర్యటనలో సర్పంచ్, ఎంపీటీసీ, అధికారులు పాల్గొన్నారు.










