ప్రజాశక్తి - చీరాల
మురుగునీరు, వరద నీరు సముద్రానికి వెళ్లేందుకు సహజ సిద్దంగా చీరాల ప్రాంతంలో ఏర్పడ్డ కుందేరు డ్రైన్ వెయ్యి మీటర్ల విస్తీర్ణం ఉంటే కేవలం 9మీటర్లు సరిపోతుందంటూ కుందేరును ఇరువైపులా పూడ్చేస్తున్నారని మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు పేర్కొన్నారు. కుందేరు ఆక్రహలను తొలగించి పూడిక తీసి నీటి పారుదలకు అనుగుణంగా అభివృద్ది చేయాలని గతంలో జిల్లా కలెక్టర్‌కు చేసిన వినతులను గాలికి వదిలేశారని ఆరోపించారు. నీటి పారుదల వనరులను ఇతర అవసరాలకు వాడవద్దని సుప్రీం కోర్టు స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ ప్రభుత్వ నిధులతో కుందేరును పూడ్చడం వెను కలెక్టర్ సమకారం ఉందని ఆరోపించారు. పూడిక తీసేందుకు నిధులు లేవంటూనే ఆక్రమణకోసం పూడ్చడానికి నిధులు ఎక్కడి నుండి సమకూర్చారని ప్రశ్నించారు. అభివృద్ధి పేరుతో చీరాలలోని కుందేరు మురుగు కాలవను జిల్లా కలెక్టర్ సహకారంతో పూడ్చి వేస్తున్నారని, దీనిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జోక్యం చేసుకుని పనులు నిలిపేయాలని కోరుతూ మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు సిఎంకు బహిరంగ లేఖ రాశారు. డాక్టర్ పాలేటి తన హాస్పటల్లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో బహిరంగ లేఖ వివరాలను వెళ్లడించారు. చీరాల పట్టణ మురుగునీటిని కుందేరు నుండే సముద్రానికి వెళుతుందని అన్నారు. తుఫానుల వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో వరద నీరు కూడా కుందేరు ద్వారానే సముద్రానికి వెళుతుందని అన్నారు. అలాంటి కుందేరును పూడ్చి వేయడం వెనక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. కుందేరు కాలవ జిల్లా కలెక్టర్ నివాసంకు 100 మీటర్ల దూరంలోనే ఉంటుందని తెలిపారు. ఇక్కడ పరిస్థితులు అన్నీ తెలిసి కూడా కుందేరు పూడికకు కలెక్టర్ సహకరిస్తున్నారని ఆరోపించారు. ఆక్రమణలకు వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమాలు జరుగుతున్నప్పటికీ లెక్కచేయకుండా డ్రైనేజీ, పంచాయతీరాజ్, రెవెన్యూ అధికారులు కుందేరును పూడ్చివేసే పనులు చేస్తున్నారని అన్నారు. ఇప్పుడు పూడ్చే పూడికను తొలగించాలంటే మళ్లీ నిధులు ఎక్కడి నుండి వస్తాయని అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి విచారణ జరిపి పూడిక పనులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో దేవరపల్లి బాబురావు, కటకం శ్రీనివాసరావు పాల్గొన్నారు.










