ప్రజాశక్తి-పాడేరు:జిల్లాలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ గిరిజనులకు అందిస్తున్న సేవలకు మంచి గుర్తింపు లభించింది. విస్తతంగా నిర్వహిస్తున్న రక్త దాన శిబిరాలు, రక్త సేకరణలను పురష్కరించుకొని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్‌ను, ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి రోణంకి గోపాల కృష్ణలకు పురష్కారం లభించింది. ఈ మేరకు సోమవారం రాజ్ భవన్‌లో నిర్వహించిన రెడ్ క్రాస్ అవార్డు ప్రదానోత్సవంలో రాష్ట్ర గవర్నర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు బిశ్వ భూషణ్ హరి చందన్ చేతుల మీదుగా కలెక్టర్, ప్రాజెక్ట్ అధికారి అవార్డులు స్వీకరించారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ తరుపున అందిస్తున్న సేవలకు గాను కలెక్టర్, ప్రాజెక్ట్ అధికారులను గవర్నర్ ప్రత్యేకంగా అభినందించి ప్రశంసించారు. భవిష్యత్తులో మరింత విస్తతంగా రెడ్ క్రాస్ సేవలను అందించాలని, రక్త నిల్వలను పెంపొందించాలని గవర్నర్ సూచించారు. వచ్చే నెలలో పాడేరు ఐటిడిఎ పరిధిలో నిర్వహించనున్న మెగా వైద్య శిభిరం, రక్తదాన శిబిరాలకు హాజరు కానున్నట్లు గవర్నర్ తెలిపారు.










