May 08,2023 23:26

గవర్నర్‌ నుంచి రెడ్‌క్రాస్‌ పురస్కారాన్ని అందుకుంటున్న కలెక్టర్‌ కృతికా శుక్లా

ప్రజాశక్తి - కాకినాడ
రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో అందించిన విశేష సేవలు, తోడ్పాటుకు ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ కాకినాడ జిల్లా శాఖ అధ్యక్షులు, జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా ప్రతిష్టాత్మక గవర్నర్‌ పురస్కారాన్ని అందుకున్నారు. సోమవారం ప్రపంచ రెడ్‌క్రాస్‌ దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ కలెక్టర్‌ కృతికా శుక్లాకు పురస్కారం అందజేశారు. అయిదారేళ్లుగా వరుసగా రాష్ట్రస్థాయి అత్యుత్తమ పురస్కారాలు జిల్లాకు లభిస్తుండగా ఈ ఏడాది కూడా మరో అత్యుత్తమ పురస్కారం సాధించిన కాకినాడ జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లాకు, రెడ్‌క్రాస్‌ జిల్లాశాఖకు గవర్నర్‌ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ కృతికా శుక్లా మాట్లాడుతూ ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ కాకినాడ జిల్లా శాఖ ఆధ్వర్యంలో వాత్సల్య వద్ధా శ్రమం, యోగా కేంద్రం, విభిన్న ప్రతిభావంతుల పాఠశాలలు, తలసేమియా కేంద్రం, బ్లడ్‌ బ్యాంకు వంటి వాటితో నిబద్ధత, అంకితభావంతో సమాజానికి విశేషమైన సేవలు అందిస్తోందని ఇప్పటికే వివిధ అవార్డులు సొంతమయ్యాయని తెలిపారు. ఈ ఏడాది కూడా గవర్నర్‌ నుంచి అవార్డు అందుకోవడం చాలా ఆనందం కలిగిస్తోందని ఇదే స్ఫూర్తితో భవిష్యత్తుల్లోనూ మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ జిల్లా శాఖకు మంచి గుర్తింపు తీసుకురానున్నట్లు కలెక్టర్‌ కృతికా శుక్లా పేర్కొన్నారు. అవార్డు అందుకోవడంపై రెడ్‌క్రాస్‌ జిల్లా శాఖ ఛైర్మన్‌ వైడీ రామారావు శుభాకాంక్షలు తెలుపుతూ కలెక్టర్‌ కృతికా శుక్లా నేతత్వంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.