ప్రజాశక్తి- బొండపల్లి : మండలంలోని జియ్యన్నవలస, నెలివాడ రెవెన్యూ గ్రామాలలో ఈ క్రాఫ్ నమోదులో భాగంగా జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి బుదవారం క్షేత్ర స్థాయిలో పరిశీలన చేశారు. ఈ మేరకు జియ్యన్నవలస, నెలివాడ గ్రామాల్లో 2023 ఖరీఫ్‌లో ఇ-పంట నమోదు ప్రక్రియను తనిఖీ చేసి ఆయా గ్రామాల రైతులతో మాట్లాడి ఇ-పంట నమోదు తీరును ఆరా తీశారు. ఈ మేరకు గొట్లాంలో గ్రామ వ్యవసాయ సహాయకులు సిరి చందన, నెలివాడలో గ్రామ వ్యవసాయ సహాయకులు అనిల్ నుండి ఇ-పంట నమోదు వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. జియ్యన్నవలసలో ధాన్యానికి సంబంధించి 430 ఎకరాలకు గాను 355 ఎకరాలను, ఉద్యానవన పంటలకు సంబంధించి మొత్తం 252 ఎకరాలు పూర్తిగా ఇ-పంటను నమోదు చేశామని కలెక్టర్‌కు వ్యవసాయ సహాయకులు సిరి చందన వివరించారు. నెలివాడలో దాన్యానికి సంబంధించి 360 ఎకరాలుకు గాను 340 ఎకరాలను, ఉద్యానవన పంటలకు సంబంధించి మొత్తం 520 ఎకరాలు పూర్తిగా ఇ-పంటను నమోదు చేశామని వ్యవసాయ సహాయకులు అనిల్ వివరించారు. రెండు గ్రామాలలో ఇ-పంట నమోదు పట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 30లోగా ఇ-పంట నమోదు చేయాలని, రైతుల ఇకెవైసి చేపట్టాలని అధికారులను ఆమె ఆదేశించారు. ఈ పర్యటనలో తహశీల్దార్ ప్రసాదరావు, వ్యవసాయ అధికారి పివి.మల్లికార్జున రావు, పిఎసియస్ అద్యక్షులు మహంతి రమణ, విఆర్‌ఒలు దుర్గ, ఎన్ దివ్య, ప్రభాకర్, డి.రవి, రైతు మీసాల తులసీ రావు, మండల రామునాయుడు పాల్గొన్నారు.










