ప్రజాశక్తి-ముంచింగిపుట్టు:మండల కేంద్రానికి కూత వేటు దూరంలో అటవీ శాఖ కార్యాలయం సమీపంలోని కుమడ వెళ్లే మార్గంలో రహదారి పక్కన పేరుకు పోయిన చెత్తను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈవోపిఆర్డి వి.చిన్నాన్న, పంచాయతీ కార్యదర్శి గోపి, స్థానిక సర్పంచ్ ఎస్.సుభాష్ చంద్ర ఆధ్వర్యంలో ఆదివారం జెసిబి సహాయంతో తొలగించారు. నెలల తరబడి రోడ్డు పక్కన చెత్త పేరుకుపోయి విపరీతమైన దుర్వాసన వెదజల్లేది. పంచాయతీ అధికారులు మాత్రం ఇన్నాళ్లు చెత్తను తొలగించేందుకు దృష్టి సారించ లేదు. శనివారం మండలంలో పర్యటించిన కలెక్టర్ సుమిత్ కుమార్ ముంచంగిపుట్టు నుండి బూసిపుట్ వెళ్లే క్రమంలో అటవీశాఖ కార్యాలయం ఎదుట పేరుకు పోయిన చెత్తను పరిశీలించారు. వెంటనే చెత్తను తొలగించాలని పంచాయతీ అధికారులకు ఆదేశించడంతో ఆదివారం ఆగమేగాలతో జెసిపి సహాయంతో చెత్తను తొలగించారు.










