ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : పాలకొండ ఎమ్మెల్యే విశ్వసరాయ కళావతికి కష్టకాలం మొదలైంది. కొన్నాళ్లుగా ఆమె చుట్టూ నెలకున్న అసమ్మతిసెగ మరింతగా అలముకుంటోంది. ఎమ్మెల్యేపై అసంతృప్తి, అసమ్మతిని ఇదే అదునుగా పరిస్థితిని పాముల సుజన తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఇందుకు ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ ఆశీస్సులు కూడా తోడవ్వడంతో పార్టీ తరపున తానే అన్ని సమస్యలూ పరిష్కరిస్తానంటూ సుజన ముందుకు దూసుకెళ్తున్నారు. మరోవైపు సుజన ముద్రించిన కరపత్రాన్ని ఎమ్మెల్యే అనుయాయులు బహిరంగంగా తగల బెట్టడంతో పాలకొండలో అధికార పార్టీ పరిణామాలు తారాస్థాయికి చేరినట్టుగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
పాలకొండ ఎమ్మెల్యేగా కళావతి గతంతో రెండుసార్లు సునాయాసంగానే గెలుపొందారు. ఈ సారి ఆ పరిస్థితి తలకిందులుగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆమె స్వయం కృపరాధమే ఇందుకు కారణని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో ఎమ్మెల్యే ఏకపక్ష నిర్ణయాల ధోరణి పెరిగిందని చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీ విక్రాంత్‌కు, ఆమెకు మధ్య నెలకున్న విభేదాలు కూడా ముదురుపాకాన పడ్డాయి. నియోజకవర్గంలో వ్యతిరేక సర్పంచులు, నాయకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈనేపథ్యంలో స్వపక్షంలో విపక్ష గళాన్ని అంచనా వేయడంలో ఎమ్మెల్యే విఫలమౌతూ వస్తున్నారు. భామిని మండలంలో ఆమె ఏకపక్ష వైఖరి మరోసారి బహిర్గతమై బెడిసికొట్టింది. దీంతో, ఆమె వ్యూహం బెడిసికొట్టి, మరింత తలనొప్పిగానే పరిణమించింది. వాస్తవానికి ఎమ్మెల్యే ఏకపక్ష నిర్ణయాలపై చాలా రోజులుగా ఈ మండలంలో కొంతమంది నాయకులు కినుక వహిస్తున్నారు. ఇదే కారణంతో కొద్దిరోజుల క్రితం జరిగిన మండల పరిషత్ సమావేశాన్ని వైసిపికి చెందిన మెజార్టీ ఎంపిటిసి సభ్యులు బహిష్కరించారు. కోరం లేక వాయిదా వేయాల్సిన ఆ సమావేశంలో కేవలం నాలుగు పంచాయతీల్లో రూ.1కోటి ఖర్చు చేసేందుకు తీర్మాణం జరిగిపోయింది. ఈ పరిణామం వెనుక ఎమ్మెల్యే కీలకపాత్ర పోషించారంటూ ఎమ్మెల్యే వ్యతిరేక ఎంపిటిసి సభ్యులంతా గుర్రుగా ఉన్నారు. సీతంపేట, పాలకొండల్లో కూడా ఇదే రకమైన వివాదాలు వైసిపి నాయకుల్లో అసంతృప్తి రేపుతున్నాయి. ఈనేపథ్యంలో వైసిపిలో కొన్నాళ్లుగా చురుకుగావుంటున్న పాముల సుజన రాజకీయాలను తనకు అనుకులంగా మలచుకునే పనిలో నిమగమయ్యారు. మొత్తం పాలకొండ నియోకజవర్గంలోని కీలక సమస్యలను ప్రస్తావిస్తూ ఇటీవల ఒక కరపత్రాన్ని ప్రచురించారు. అందులో పేర్కొన్న సమస్యలన్నింటి పరిష్కారానికి కృషిచేస్తానని, ప్రజలు, నాయకులు తనను ఆశీర్వదించాలని అందులో పేర్కొన్నారు. దీంతో, ఎమ్మెల్యేతోపాటు ఆమె ఆనుయాయులు కంగు తిన్నారు. ఏం చేయాలో అర్థంకాని పరిస్థితుల్లో సుజన ముద్రించిన కరపత్రాన్ని తగలబెడుతూ వ్యతిరేక నినాదాలు కూడా చేశారు. టిడిపి సానుభూతిపరులతో జతకట్టిన సుజన పార్టీని రెండుగా చీలుస్తున్నారంటూ గుర్రుపెడుతున్నారు. ఎమ్మెల్సీ విక్రాంత్, ఆయన అనుయాయులు సుజనను ప్రోత్సహిస్తున్నారని కూడా ఎమ్మెల్యే గ్రూపు ఆరోపణలు చేస్తోంది. ఈ వరుస పరిణామాలతో నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనుకూల, వ్యతిరేక గ్రూపుల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. పరిస్థితులు ఎలా మారుతాయో వేచిచూడాల్సిందే.










