Apr 08,2023 00:01

వంటా వార్పు చేసి భోజనాలు చేస్తున్న కళాసీలు

ప్రజాశక్తి-అచ్యుతాపురం
అచ్యుతాపురం ఎస్‌ఇజెడ్‌లోని రసూల్‌ డెకర్‌ ప్లైవుడ్‌ కంపెనీలో కళాసీలకు తక్షణమే పనులు కల్పించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జి.కోటేశ్వరరావు హెచ్చరించారు. కంపెనీ ఎదుట ముఠా కార్మికులు చేస్తున్న ఆందోళన మూడో రోజుకు చేరింది. శుక్రవారం ముఠా కార్మికులు వంటా వార్పు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ గతంలో పెద్దలు, పరిశ్రమ ప్రతినిధులతో జరిగిన ఒప్పందం ప్రకారం లోడింగ్‌, అన్‌ లోడింగ్‌ పనుల్లో కళాసీలకు కూలి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సెజ్‌లో భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు ఉపాధి కల్పించాల్సింది పోయి, ఉన్న ఉపాధిని దెబ్బతీయడం అన్యాయమన్నారు. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలన్న ప్రభుత్వ నిబంధనలు అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం జోక్యం చేసుకొని కళాసీల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్‌ రాము, కళాసీలు గొర్లి నాగేశ్వరరావు, గొర్లి సత్తిబాబు, నానాజీ, గుర్రం సూరిబాబు, అప్పలనాయుడు, కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.