Jul 24,2023 21:12

నిరసన దీక్ష చేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

రాజంపేట అర్బన్‌ : జూనియర్‌ కళాశాలల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు రమణ డిమాండ్‌ చేశారు. సోమవారం జూనియర్‌ కళాశాలల సమస్యలపై సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిరసన చేపట్టడం జరిగిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని పూర్తిగా నీరు కారుస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొస్తూ విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తోందని, కేంద్ర ప్రభుత్వం తీరుతో పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నత చదువులు చదవడానికి విద్య అందని ద్రాక్షలా మారిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జూనియర్‌ కళాశాలల్లో నెలకొన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని, ఇంటర్‌ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఉచితంగా ఇవ్వాలని, బస్సు పాసులు సౌకర్యం కల్పించాలని, అర్హులైన ప్రతి విద్యార్థికి అమ్మఒడి పథకాన్ని వర్తింపచేయాలని, జూనియర్‌ కళాశాల అనుబంధంగా సంక్షేమ హాస్టళ్లు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. సమస్యలను పరిష్కరించని పక్షంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని, త్వరలోనే ఛలో కలెక్టరేట్‌ కార్యక్రమం ద్వారా కలెక్టర్‌ కార్యాలయం ముట్టడిస్తామని తెలియ జేశారు. నిరసన దీక్ష కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి మనోజ్‌, రమణ, చిన్నారెడ్డి, కిరణ్‌, హరి, చరణ్‌, నాసర్‌, చైతన్య, సాయి పాల్గొన్నారు.