Apr 24,2023 21:50

ప్రజాశక్తి - ఉంగుటూరు
           నారాయణపురం శ్రీ అరవింద శతజయంతి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా గ్రంథాలయ సంఘం తరపున కళాశాల గ్రంథాలయానికి సుమారు రూ.2.50 లక్షల విలువైన రెండు వేల పుస్తకాలను బహూకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ టికె.విశ్వేశ్వరరావు మాట్లాడుతూ మానవ వికాస దశలో పుస్తకం మనిషిని మహోన్నతునిగా మలచిందన్నారు. ప్రతి విద్యార్థి పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలన్నారు గ్రంథాలయ సంఘం సంయుక్త కార్యదర్శి ఎల్‌.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఒక మంచి పుస్తకం వెయ్యి మంది మిత్రులతో సమానమన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయ సంఘం కోశాధికారి, కళాశాల ఐక్యు ఆర్డినేటర్‌ డాక్టర్‌ కొండా రవి మాట్లాడుతూ ఆధునిక కాలంలో ఈ పుస్తకాలు ఆడియో, వీడియోల రూపంలో అందుబాటులో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకొని విజ్ఞాన సౌభాగ్యం చేయాలని అన్నారు. సీనియర్‌ న్యాయవాది, ట్రైనర్‌ కూన కృష్ణారావు సైబర్‌ నేరాలు - చట్టాలు అవగాహన అంశంపై వివరించారు. ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలను నిర్వహించి గ్రంథాలయ సంఘం తరపున ప్రశంసాపత్రం, పుస్తకాలను బహూకరించారు. ఈ కార్యక్రమంలో రెడ్డయ్య, లైబ్రరీ ఇన్‌ఛార్జి హెప్సిబా, పి.భాస్కరరావు పాల్గొన్నారు.