Nov 21,2023 00:42

ప్రజాశక్తి - నిజాంపట్నం
ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నూతన భవనం నిర్మించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఆర్య అన్నారు. మండలంలోని వివిధ విద్యాసంస్థలను ఆయన సందర్శించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. కళాశాల పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆర్య మాట్లాడుతూ దశాబ్దాలుగా ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవనానికి నోచుకోలేదని అన్నారు. తుఫాన్ షెల్టర్‌లో తరగతులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ పరిస్థితుల కారణంగా చుట్టుపక్కల గ్రామాల పేద విద్యార్థులు రేపల్లె, పెట్టలవానిపాలెం, కాజీపాలెం ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారని అన్నారు. క్రమంగా కళాశాలలో చేరే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుందని అన్నారు. పాలకులు మారుతున్న కళాశాల పరిస్థితులు మాత్రం మారడం లేదని అన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు విద్యారంగం పట్ల కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. విద్యార్థుల తల్లి ఖాతాల్లో నగదు జమ చేస్తే విద్యా ప్రమాణాలు మెరుగుపడవని, కనీస సౌకర్యాలు కల్పిస్తేనే విద్యా ప్రమాణాలు పెరుగుతాయని అన్నారు. ఈ ప్రాంత విద్యార్ధులకు సాంకేతిక విద్య అవసరమని అన్నారు. అందుకే ఐటిఐ కళాశాలను అభివృద్ది చేయాలని కోరారు. కళాశాలకు నిధులు ఉన్న స్థలం లేదనే సాకుతో భవనం నిర్మించకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు గ్రామంలో విద్యాసంస్థల వైపు తిరిగి చూడాలని కోరారు. ఇప్పటికైనా ఆలోచించి కళాశాల నిర్మాణానికి ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో కళాశాల కమిటీ కార్యదర్శి ప్రేమ్ చంద్, అధ్యక్షులు విజయ్, లక్ష్మయ్య, మురళి, వెంకట గణేష్ పాల్గొన్నారు.