
ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి ఎస్.అనిల్‌కుమార్
ప్రజాశక్తి-గన్నవరం : సమస్యలపై ప్రజలను మేల్కొలిపేది ఆట, పాట అని ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి ఎస్.అనిల్‌కుమార్ తెలిపారు. ప్రజానాట్య మండలి రాష్ట్ర స్థాయి డప్పు శిక్షణా శిభిరం కష్ణా జిల్లా గన్నవరంలో ఆదివారం ప్రారంభమయ్యింది. ఈ శిభిరం ప్రారంభ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ... పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రైవేటీ కరణ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేయడానికి ప్రజాకళాకారులు పాటుపడాలని పిలుపు నిచ్చారు. మహిళలు, దళితులపై జరుగుతున్న దాడులపై గళమెత్తా లన్నారు. భావప్రకటనా స్వేచ్ఛను హరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందున్నా యని ప్రతిపక్ష నేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా బాపట్లలో సైకత శిల్పం వేసిన కళాకారుడిపై కేసులు పెట్టడం అత్యంత హేయమైన చర్య అని ప్రభుత్వ చర్యను దుయ్యబట్టారు. కవులు, కళాకారులపై ఆంక్షలు విధించడం, ప్రశ్నని చంపాలనుకోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదమన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ప్రజల మధ్య చీలికలు సష్టించి తన పబ్బం గడుపుకోవాలని చూస్తుందన్నారు. ఈ అంశాలన్నింటిపై ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం ప్రజాకళారూపాలకు పదును పెట్టేందుకే ఈ శిక్షణా శిభిరం నిర్వహిస్తున్నా మన్నారు. డప్పు మోతతో పాలకుల గుండెలదరాలన్నారు. ప్రజానాట్యమండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు గాదె సుబ్బారెడ్డి మాట్లాడుతూ రానున్న కాలంలో ప్రజాకంటక విధానాలపై గ్రామగ్రామాన కళాకారులు దళాలుగా ఏర్పడి ప్రజల్ని పోరాటాలకు సన్నద్ధం చేయాలన్నారు. కళ ప్రజల కోసం అనే లక్ష్యంతో ప్రజానాట్యమండలి కళాకారులు కషి చేయాలన్నారు. ఈ శిభిరానికి రాష్ట్ర సహాయ కార్యదర్శి ఖాశిం ప్రిన్సిపాల్‌గా వ్యవహరించగా డప్పు శిక్షకుడిగా ఎం.పరమేష్ శిక్షణ ఇచ్చారు. ఈ మూడు రోజులు జరిగే శిక్షణా శిభిరానికి రాష్ట్ర సహాయ కార్యదర్శి షేక్ ఖాశిం ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తున్నారు. శిక్షకులుగా ప్రముఖ డప్పు మాస్టర్ ఎం. పరమేష్ గారు వ్యవహరిస్తున్నారు. కష్ణా, గుంటూరు, రంపచోడవరం, పల్నాడు, నెల్లూరు, ఏలూరు జిల్లాల నుండి కళాకారులు శిక్షణకి హాజరయ్యారు.