ప్రజాశక్తి - పెద్దాపురం పెద్దాపురం మండలం రాయభూపాలపట్నంలో జరిగిన కుంతీదేవి అమ్మవారి జాతర ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన జానపద కళారూపాల ప్రదర్శనల్లో ఉత్తమ ప్రదర్శకులకు ఆదివారం బహుమతులు అందజేశారు. ఈ జాతరలో ఎనుపోతు చర్మంతో తయారుచేసిన పెద్ద డంకా వాయిద్యం, కళాకారులు మోకాళ్ళ వరకు గడ్డి చుట్టుకుని కాళ్లకు ఇనప గజ్జెలుతో ప్రదర్శించే ప్రాచీన జానపద గారడి కళారూపాన్ని పలు గ్రామాల కళాకారులు ప్రదర్శించారు. ఈ ప్రదర్శకులలో పేరా రామచంద్రపురం కళాకారులు ప్రదర్శించిన కళారూపం ప్రథమ బహుమతి సాధించింది. మర్రిపూడి, గొర్రెపల్లి, కొత్త మంజీర గ్రామాల కళాకారుల కళారూపాలను కూడా ఎంపిక చేసి కళాకారులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉండ్రా వెంకట్, నొక్క బేబీరత్నం, లాజర్, పచ్చిపాల సత్తిబాబు, వడ్లపాటి చిట్టిబాబు, బుజ్జి బాబు, నాని, వల్లపు సత్తిబాబు, శివకష్ణ, సిద్దు, సాంబత్తుల విజరు తదితరులు పాల్గొన్నారు.










