ప్రజాశక్తి -పిఎం పాలెం : క్లాప్ వాహనాల డ్రైవర్లకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని సిఐటియు మధురవాడ జోన్ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు క్లాప్ వాహనాల డ్రైవర్లు సోమవారం వాహనాలు నిలిపివేసి 6వ వార్డు పరిధి సాయిప్రియ లే-అవుట్ యార్డ్ వద్ద నిరసన తెలిపారు. వీరికి సిఐటియు మధురవాడ జోన్ నాయకులు డి.అప్పలరాజు, పి.రాజుకుమార్, కె.నాగరాజు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భగా అప్పలరాజు మాట్లాడుతూ, క్లాప్ వాహనాల నడిపే డ్రైవర్లకు రూ.18 వేలు జీతం, పిఎఫ్, ఇఎస్‌ఐ అమలు చేస్తామని హామీ ఇచ్చి నేడు రూ.10 వేలు మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. ధరలు, పన్నులు పెంచుకుంటూ పోతున్న ప్రభుత్వం డ్రైవర్లు వేతనాలు మాత్రం పెంచక పోవడం దుర్మార్గమన్నారు. కార్మికుల నుంచి వసూలుచేసిన పిఎఫ్, ఇఎస్‌ఐ సక్రమంగా జమచేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం రూ.26 వేలు ఇచ్చే వరకు పోరాడాలని పిలుపునిచ్చారు.










