Dec 17,2022 23:18

క్లాప్‌ డ్రైవర్లతో చర్చిస్తున్న డిసిపి సన్యాసిరావు

ప్రజాశక్తి -పిఎం పాలెం : జివిఎంసి 8వ వార్డులో క్లాప్‌ వాహనాల డ్రైవర్లపై జోనల్‌ కమిషనర్‌ దురుసు ప్రవర్తించారని, మరికొన్ని సమస్యలపై జోన్‌-2 కార్యాలయం వద్ద శనివారం డ్రైవర్లు నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న డిసిపి సన్యాసిరావు జోనల్‌ కార్యాలయానికి చేరుకొని సిఐటియు మధురవాడ జోన్‌ నాయకులు, వాహనాల డ్రైవర్లతో సమస్యలపై చర్చించారు. 30 నుంచి 40 కిలోమీటర్ల దూరం చెత్త సేకరణ చేపట్టే వాహనాలకు మరో సచివాలయం పరిధి బాధ్యతలు అప్పగించారు. 60 నుంచి 90 కిలోమీటర్ల దూరంలో చెత్త సేకరణ చేపట్టే వాహనాలకు మరో వాహనాన్ని అదనంగా ఏర్పాటుచేసేలా చర్యలు తీసుకోవాలని డిసిపి ఆదేశాలు జారీ చేశారు. ప్రతి వాహన డ్రైవరూ ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వారి పనులు పూర్తి చేసుకునే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. డ్రైవర్లు విధి నిర్వహణలో ఏటువంటి సమస్య తలెత్తినా జోనల్‌ కమిషనర్‌ కల్పించుకోవద్దన్నారు. ఎఎంహెచ్‌ఒ, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌, సెక్రెటరీలు వివరణ తీసుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఎంహెచ్‌ఒ శాస్త్రి, జోన్‌-2 కమిషనర్‌ బొడ్డేపల్లి రాము, ఎఎంహెచ్‌ఒ పి.కిషోర్‌, సిఐటియు మధురవాడ జోన్‌ నాయకులు డి.అప్పలరాజు, పి.రాజ్‌ కుమార్‌, జివిఎంసి కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ కార్మిక సంఘం విశాఖ జిల్లా డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ ప్రసాద్‌ పాల్గొన్నారు.