రాజంపేట అర్బన్ : ఐదు నెలలుగా నిలబడిపోయిన క్లాప్ డ్రైవర్ల వేతనాలు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని సిఐటియు వైఎసఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలోని శ్రామిక కార్యాలయంలో క్లాప్ జెఎసి ఆధ్వర్యంలో ఎసిఎల్ పద్మావతికి క్లాప్ డ్రైవర్ల సమస్యలు వివరించి వారికి త్వరితగతిన న్యాయం చేయాలని కోరారు. అనంతరం క్లాప్ జెఎసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ రాయచోటి, ప్రొద్దుటూరు మండలాలలో క్లాప్ డ్రైవర్లకు ఐదు నెలల నుంచి వేతనాలు నిలబెట్టారని పేర్కొన్నారు. ఇఎస్‌ఐ, పిఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. జిఒ నెంబర్ 7 ప్రకారం డ్రైవర్లకు రూ.7500 వేలు వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 13వ తేదీ లోపల సమస్యలు పరిష్కరించాలని పేర్కొన్నారు. లేనిపక్షంలో డిసెంబరు 13న జెఎసి సమావేశం నిర్వహించి భవిష్యత్తు భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, మున్సిపల్ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ విజరు కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు చంటి, ప్రొద్దుటూరు మున్సిపల్ శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ గోవింద్‌రెడ్డి, సుబ్బరాయుడు పాల్గొన్నారు.