May 10,2023 23:27

భిక్షాటన చేస్తూ ప్రదర్శనగా వెళ్తున్న క్లాప్‌ డ్రైవర్లు

ప్రజాశక్తి-కలెక్టరేట్‌, విశాఖ : జెసిఎల్‌ ఆదేశం మేరకు జిఒ 7ను అనుసరించి క్లాప్‌ డ్రైవర్లకు రూ.18,500 జీతం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం సాయంత్రం జివిఎంసి గాంధీ విగ్రహం నుంచి జివిఎంసి ప్రధాన కార్యాలయం వరకు వందలాదిమంది క్లాప్‌ డ్రైవర్లు భిక్షాటన చేస్తూ ప్రదర్శన నిర్వహించారు. జివిఎంసి ప్రధాన కార్యాలయం గేటు వద్ద రూ.18,500 జీతం చెల్లించాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జివిఎంసి కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) గౌరవాధ్యక్షులు పి.వెంకటరెడ్డి మాట్లాడుతూ, గురువారం విశాఖ నగరానికి వస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తన స్వహస్తాలతో విడుదల చేసిన జిఒ 7 ప్రకారం రూ.18,500 వేతనం వివక్ష లేకుండా వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. జాయింట్‌ లేబర్‌ కమిషనర్‌ ఇచ్చిన డైరెక్షన్‌ను అమలు చేయించాలని కోరారు. యూనియన్‌ తరపున ముఖ్యమంత్రిని కలవడానికి అవకాశం ఇవ్వాలని కోరారు. కాంట్రాక్ట్‌ దోపిడీ వ్యవస్థ లేకుండా ఆప్కాస్‌ను తెచ్చామని జిఒ 136 తెచ్చాక, మరలా క్లాప్‌ డ్రైవర్ల వ్యవస్థలో కాంట్రాక్టర్‌ను పెట్టడం సమంజసం కాదన్నారు. సిఎం ఇచ్చిన జిఒ ప్రకారం రూ.18,500 చెల్లించకుండా కేవలం రూ.12,500 మాత్రమే కాంట్రాక్టర్‌ చెల్లిస్తున్నారని, ఇది అన్యాయం అన్నారు. అవినీతిని సహించనన్న సిఎం మాట నిలుపుకోవాలన్నారు. కటింగులు పోగా రూ.10 వేలు వస్తే కుటుంబాలను ఎలా పోషించుకోవాలని యూనియన్‌ నాయకుడు పి.అనీల్‌కుమార్‌ ఆవేదన వ్యక్తంచేశారు. యూనియన్‌ అధ్యక్షులు టి.నూకరాజు మాట్లాడుతూ, కార్మిక సమస్యలు చెప్పుకోడానికి ముఖ్యమంత్రి ఇంటర్వ్యూ ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌.రమణ, నాయుడు, అప్పారావు, సురేష్‌, అప్పన్న, అభి, సుధాకర్‌, రామకృష్ణ ప్రసంగించారు.