Feb 16,2023 22:46

ప్రజాశక్తి-విజయవాడ: క్లాప్‌ ఆటో డ్రైవర్ల న్యాయమైన సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సిఐటియు పశ్చిమ సిటీ కార్యదర్శి బోయి సత్యబాబు, మునిసిపల్‌ కార్పొరేషన్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నగర అధ్యక్షులు ఎస్‌.జ్యోతిబాస్‌ హెచ్చరించారు. జిఒ నెంబర్‌ 7 ప్రకారం క్లాప్‌ ఆటో డ్రైవర్లకు నెలకు రూ.18,500 వేతనం ఇవ్వాలని, డ్రైవర్లపై మోపుతున్న భారాలను తొలగించాలని కోరుతూ క్లాప్‌ ఆటో డ్రైవర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో గురువారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటింటికీ చెత్త సేకరణ చేసే వాహన డ్రైవర్లు నిత్యం అనేక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వీధుల్లో సేకరించే చెత్తను తరలించే క్రమంలో దుర్గంధపూరిత వాతావరణంలో నిత్యం పలు రకాల ఆనారోగ్యాలకు గురికావాల్సి వస్తోందన్నారు. పనికి తగిన వేతనం లేక, పెరిగిన ధరలతో కుటుంబాలు గడవక, క్లాప్‌ ఆటో డ్రైవర్లు అప్పులు చేసి కుటుంబాలను నడుపుకోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. నెలకు నాలుగు సెలవులు మంజూరు చేయాలని, గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రమాదవశాత్తు అనుకోకుండా ఏదేని ఘటన జరిగి వాహనాలు దెబ్బతింటే ఆ నష్టాన్ని డ్రైవర్ల వేతనాల్లో నుంచి మినహాయించుకుంటూ సంబంధిత కాంట్రాక్టర్‌ భారీ మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నాడని, ఇటువంటి నష్టాలను యాజమాన్యమే భరించాలని కోరారు. ప్రమాద బీమా కింద రూ.20 లక్షలు ప్రీమియం విఎంసి చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ప్రజారోగ్య విభాగం ముఖ్యఅధికారి డాక్టర్‌ పి.రత్నావళికి నాయకులు వినతిపత్రం అందజేశారు. దీనిపై ఆమె స్పందిస్తూ సమస్యలను కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైన మేరకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు వేల్లూరి సాంబులు, కిరణ్‌, దనాల శ్రీను తదితరులు పాల్గొన్నారు.