ప్రజాశక్తి-విజయవాడ
ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలకు వివిధ కళారుపాలతో జీవం పోసి భావితరాలకు అందిస్తున్న పేద కళాకారులను ప్రభుత్వం అన్ని విధాల ప్రోత్సహిస్తుందని, కళాకారుల సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు. సమాచార పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన కళాకారులకు మంజూరైన గుర్తింపు కార్డులను మంగళవారం కలెక్టర్ ఆయన కార్యాలయంలో అందజేశారు. అనంతరం మాట్లాడుతూ 58 సంవత్సరాలు నిండిన అర్హులైన కళాకారులకు పెన్షన్ మంజూరు చేసేలా సాంస్కృతిక శాఖకు ప్రతిపాదనలు పంపిస్తున్నామన్నారు. ఎన్‌టిఆర్ జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 200 మంది వృద్ధ కళాకారులకు పెన్షన్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. 3,463 మంది డప్పు కళాకారులకు పెన్షన్లను మంజూరు చేసి నెలకు రూ.3 వేల చొప్పున అందిస్తున్నామన్నారు. డప్పు కళాకారులకు నృత్యాల గేయాలపై శిక్షణ అందించి వారి ప్రతిభను మరింత పెంచేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసే సాంస్కృతిక కార్యక్రమాలలో జిల్లాకు చెందిన డప్పు కళాకారుల సేవలను వినియోగించుకునేలా అధికారులను ఆదేశిస్తామన్నారు. గుర్తింపు కార్డుల ద్వారా కళాకారులు ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసంబంధాల అధికారి ఎస్‌వి మోహన్‌రావు, ఆడియో విజువల్ సూపర్‌వైజర్ ఎ.సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.
పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలి
ఓటర్ల జాబితాలో కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, సవరణలకు సంబంధించి సమర్పించిన పెండింగ్ దరఖాస్తులను రెండు రోజుల్లో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. ఓటర్ల జాబితా రూపొందించడంపై మంగళవారం కలెక్టర్ డిల్లీరావు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫారం-6, 6ఏ, 7, 8లకు సంబంధించి జిల్లాలో ఇప్పటివరకు 12,916 దరఖాస్తులు సమర్పించడం జరిగిందన్నారు. వీటిలో ఇంకనూ 8,030 దరఖాస్తులను పరిష్కరించాల్సి ఉందన్నారు. అధికారులు సమన్వయం చేసుకుని పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపొందించడానికి సహకరించాలని కలెక్టర్ డిల్లీరావు కోరారు.










