Dec 15,2022 00:09

'ప్రజాశక్తి'తడాక్టర్‌ పైడి రమణమూర్తి,

ప్రజాశక్తి - గ్రేటర్‌ విశాఖ బ్యూరో
విశాఖ నగరంలోగల 'కళా ఆసుపత్రి' సేవా దృక్పథం అంతకంతకూ విస్తరిస్తోంది. ఉత్తరాంధ్ర ఆసుపత్రుల రంగంలో ఆరోగ్యానికి ఒక పెద్ద భరోసాగా ఉంటూ.. ప్రయివేట్‌ ఆసుపత్రుల రంగంలో పేదలకు నామమాత్రపు రుసుముతో కార్పొరేట్‌ వైద్య సేవలు అందిస్తూ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో ప్రజల నోట్లో నాలుకలా మారిన హాస్పిటల్‌గా డాక్టర్‌ పైడి రమణమూర్తి, డాక్టర్‌ కళావతి నిర్వహణలో సాగుతున్న ఈ వైద్యశాల అంచెలంచెలుగా ఎదుగుతోంది. నాణ్యమైన వైద్యం, విలువైన ఆరోగ్య సలహాలు, రోగులతో ఆప్యాయ సంభాషణల మేళవింపుగా దశాబ్దాలుగా విరాజిల్లుతోన్న ఈ 'కళా' ఆసుపత్రి... మరో కీలకమైన మైలురాయిని అందిపుచ్చుకుంది. 'కళా వాటర్‌ ప్యాకింగ్‌ ఇండిస్టీ'గా పూర్తి పర్యావరణ ప్రమాణాలు, ఐఎస్‌ఒ సర్టిఫికెట్‌ కంపెనీ అనుమతులతో విజయనగరం-విశాఖపట్నం జాతీయ రహదారిలో పూసపాటిరేగ మండల కేంద్రంలో స్థాపించబడటం ఒక శుభపరిణామం. శ్రీకాకుళం జిల్లా కింతలి గ్రామానికి చెందిన డాక్టర్‌ పైడి వెంకటరమణమూర్తి.. 'కళా' ఆసుపత్రి విశాఖ నగరంలోని ద్వారకానగర్‌ 6వ లైన్‌లో బివికె కళాశాలకు దగ్గరలో దశాబ్దాల క్రితం స్థాపించబడి వైద్య సేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఉత్తరాంధ్ర ప్రజల్లో రక్షిత మంచినీటి డిమాండ్‌ నానాటికీ పెరుగుతున్న నేటి పరిస్థితుల్లో 'కళా' యాజమాన్యం 'ప్యాకేజ్డ్‌ ప్రొటెక్టెడ్‌ వాటర్‌' సరఫరా వంటి కీలక నిర్ణయం తీసుకోవడం విశేషం. 'రక్షిత నీరు ప్రజలను రోగాల నుంచి నిలువరించే అత్యంత శక్తివంతమైన సాధనం' అని నమ్మిన కళా ఆసుపత్రి యజమాన్యం ప్రముఖ వైద్యులు పైడి వెంకట రమణమూర్తి, ఆయన సతీమణి కళావతి ప్రజలకు పరిశుద్ధమైన నీటిని సరఫరా చేసేందుకు 'కళా ఆగ్రో ఫుడ్స్‌' ద్వారా ఈ ప్యాకింగ్‌ పరిశ్రమను స్థాపించారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పి.రమణమూర్తి (కళా రమణమూర్తి) 'ప్రజాశక్తి'కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
ఎందుకు ఈ నీటి పరిశ్రమను స్థాపించాలనుకున్నారు ?
భూమిపై జీవజాలానికి ఉపయోగపడే సహజ వనరు నీరు. అన్ని జీవులూ పెరగడానికి, పునరుత్పత్తికి నీరే అత్యంత కీలకం. అయితే భూమిపై గల నీటిలో 97 శాతం ఉప్పునీరే. మూడు శాతం మాత్రమే మంచినీరు. ఇది చాలా ఆశ్ఛర్యంగొలిపే అంశం. ఈ మూడు శాతంలోనూ మూడింట రెండు వంతులు హిమానీనదాల్లోనూ, ధ్రువాల వద్ద గల మంచు దుప్పట్లలోనూ ఘనీభవించి ఉందన్నది వాస్తవం. మనిషి బతకడానికి, ఇతర జీవరాశులు ఉత్పత్తికి మిగిలి ఉన్న ఈ మంచినీటిని మరింత సురక్షితంగా అందించగలిగితే అది 'పర్యావరణ సహిత రక్షిత నీరు' అవుతుంది.. అందుకే నేను, నా సతీమణి కళావతి సారథ్యంలో రక్షిత మంచినీటి ప్యాకింగ్‌ ఇండిస్టీకి ప్లాన్‌ చేసి అమలు చేశాం.
ప్రజలకు రోగాలు రాకుండా ఒక్క నీటితోనే ఎలా సాధ్యం ?
నేడు ప్రజల అనారోగ్యాల్లో సింహభాగం నీటి లోపంతోనే వస్తున్నాయి. ప్రజల మౌలిక అవసరాల్లో నీరే ప్రప్రథమం. నీరు రోగం రావడానికి / రోగం పోవడానికీ దోహదం చేస్తోంది. పర్యావరణ సహితంగా నీటిని సరఫరా చేయగలిగితే అనారోగ్య సమస్యలు రావు. నీరు అనేది సమాజ జీవన గమనంలోనూ, వ్యక్తి జీవన విధానంలోనూ అగ్రభాగం ఆక్రమించిందన్నది అందరూ గుర్తించాలి. ప్రజలు కచ్చితంగా రోజుకూ రెండు లీటర్లు కలుషితం లేని నీటిని తాగాలి.
నీరు ఎలా కలుషితం అవుతోంది ?
భూమిలోకి కాలుష్య ఉద్గారాలు, ఇతర మలినాలు వచ్చి నీటిని పాడుచేస్తున్నాయి. మనిషి శరీరం, అతడు జీవించే పరిసరాలు పరిశుద్ధంగా ఉండాలంటే నీరే ప్రధానమైనది. ప్రభుత్వాలు, ప్రైవేట్‌ సంస్థలు ఏవైనా ఈ రక్షిత నీటి సరఫరా మీదనే దృష్టిసారించాల్సి ఉంది. ప్రభుత్వం నాణ్యమైన, పర్యావరణ ప్రమాణాలతో ఇచ్చే ప్రయత్నాలు చేస్తోన్నప్పటికీ అవకాశం ఉన్నమేరకు సేవా దృక్పథంతో నీటి అవసరాలను గుర్తించే వారు ప్రజల మౌలిక వసతుల్లో భాగమైన నీటి పంపిణీ గురించి ఆలోచించాల్సి ఉంది. ఈ క్రమంలోనే మా బ్రాండ్‌ నేమ్‌ 'కళా ఆగ్రో ఫుడ్స్‌'తో ముందుకెళ్తున్నాం. ఈ వాటర్‌ ప్యాకింగ్‌ ఇండిస్టీని పూసపాటిరేగలో ఐదు ఎకరాల్లో స్థాపించాం.
మీ ప్యాకింగ్‌ ఇండిస్టీ సామర్థ్యం ఎంత?
పర్యావరణ ప్రమాణాలన్నిటినీ పాటిస్తూ నీటి ప్యాకింగ్‌ యూనిట్‌ను మూడు నెలల క్రితం పూసపాటిరేగ నేషనల్‌ హైవే రోడ్డు పక్కనే స్థాపించాం. సరసమైన ధరలకే ప్రజలకు నీటి సరఫరా చేస్తున్నాం. 100 కిలోమీటర్ల పరిధిలో నీటి సరఫరాకు సిద్ధం అయ్యాం. రోజుకు ప్లాంట్‌ సామర్థ్యం 40 వేల లీటర్లు ఉత్పత్తి చేస్తున్నాం. ప్యూర్‌ ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ను ప్రజావసరాల కోసం సరఫరా చేస్తున్నాం. భారీ సామర్థ్యంతో ఈ పెద్ద ప్రాజెక్టును రూపొందించాం. అన్ని ప్రాంతాల నుంచి వాటర్‌ ఆర్డర్లను స్వీకరిస్తూ సరఫరా చేయడం ప్రారంభించాం. విశాఖ నగరంలోనూ రక్షిత నీటికి పెరుగుతున్న డిమాండ్‌ దృష్ట్యా విస్తరించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం.