Sep 08,2023 22:49

గుంటూరులో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతున్న గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం మేనేజింగ్‌ ట్రస్టీ పాశం రామారావు

ప్రజాశక్తి-తాడేపల్లి : కళ కళ కోసం కాదని... ప్రజల కోసమని వెలుగెత్తి చాటిన ప్రజా కళాకారులు డాక్టర్‌ గరికపాటి రాజారావు అని ప్రజా నాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.అనిల్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం తాడేపల్లి ప్రజా నాట్యమండలి రాష్ట్ర కార్యాలయంలో ప్రజా కళాకారుడు డాక్టర్‌ గరికపాటి రాజారావు వర్ధంతి సభ నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పిఎన్‌ఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు గాదె సుబ్బారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ గ్రామాలకు వెళ్లడానికి సరైన సౌకర్యాలు లేని రోజుల్లో మోకాళ్ల లోతు బురదలో కూడా పేదల పేటలకు వెళ్లి తమ కళారూపాల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేశారని కొనియాడారు. తుదిశ్వాస విడిచే వరకూ మొక్కవోని దీక్షతో పని చేశారన్నారు. నాటికలు, వీధి నాటకాల ద్వారా లక్షలాది మంది ప్రజల్లో చైతన్య కలిగించారని తెలిపారు. ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు పి.మంగరాజు మాట్లాడుతూ కళారూపాల్లో ప్రతి సన్నివేశంలోనూ పాలకుల మోసాలను తెలియజేయడంతో పాటు పేదలు పడే ఇతివృత్తాలను ఎంచుకుని తన కళారూపాల్లో చెప్పేవారని గుర్తు చేశారు. అనేక మంది కళాకారులను తయారు చేసిన కళామ్మతల్లి ముద్దుబిడ్డ రాజారావు అని కొనియాడారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు గాదె సుబ్బారెడ్డి మాట్లాడుతూ రాజారావు ఒకపక్క పేదలకు డాక్టర్‌గా పేదలకు వైద్యలందిస్తూనే మరోపక్క సమాజంలో జరుగుతున్న దోపిడీని దుర్మార్గాన్ని ఇతివృత్తాలు చేసుకుని ప్రజల్ని చైతన్యవంతం చేశారని కొనియాడారు. పాటను ప్రజా ఆయుధంగా మలిచిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. కళారూపాలను ప్రదర్శిస్తున్న సమయంలో పోలీసులు అరెస్టు చేసి ఆయన్ను చిత్రహింసలకు గురి చేసినా పోలీసులు ఒక్క రహస్యం కూడా రాబట్టలేకపోయారని తెలిపారు. సిపిఎం రూరల్‌ కార్యదర్శి దొంతిరెడ్డి వెంకటరెడ్డి, జానపద వృత్తికళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎ.జగన్‌, సిపిఎం పట్టణ కార్యదర్శి బూరుగ వెంకటేశ్వర్లు, కార్యదర్శి వర్గ సభ్యులు కొట్టె కరుణాకరరావు, తాడేపల్లి సుందరయ్య సాంస్కృతిక సేవా సమితి కన్వీనర్‌ గాదె సుబ్బారెడ్డి మాట్లాడుతూ మతతత్వ బిజెపి ఫాసిస్టు పాలన ముందుకొచ్చిన నేటి తరుణంలో రాజారావు లేని లోటు తీరనిదన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు అర్పించే ఘనమైన నివాళి అని అన్నారు. సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలపై బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ చేస్తున్న రగడ మానుకోవాలన్నారు. స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలను మేధావులు, అభ్యుదయవాదులు, ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో విజయవాడ ఎంబివికె బాధ్యులు యువి రామరాజు, ఎస్‌.ముత్యాలరావు, కె.వెంకటయ్య, టి.నాగేశ్వరరావు, ఎన్‌.దుర్గారావు, ఎస్‌కె బాష, ప్రభాకర్‌, అంజిరెడ్డి, కె.సుబ్బారావు, కొండబాబు, శ్రీను, చిన్నమ్మాయి పాల్గొన్నారు.
ప్రజాశక్తి- గుంటూరు : ప్రజానాట్యమండలి వ్యవస్థాపకులు గరికపాటి రాజారావు సాహిత్య కషిని కొనసాగించాలని గుఱ్ఱం జాషువా విజ్ఞాన కేంద్రం మేనేజింగ్‌ ట్రస్టీ పాశం రామారావు అన్నారు. శుక్రవారం గరికపాటి రాజారావు వర్ధంతి సందర్భంగా బ్రాడిపేటలోని ప్రజానాట్యమండలి జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పాశం రామారావు మాట్లాడుతూ ప్రజానాట్యమండలిని ఏర్పాటు చేసి 'కళ కళకోసం కాదని, కళ ప్రజలకోసం' అని సాటిచెప్పి ప్రజల్లో నాటికలు, కళలు, సాహిత్యం ద్వారా చైతన్యం తీసుకొచ్చారని అన్నారు. ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై కళారూపాలు రూపొందించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మొత్తం ప్రదర్శించారన్నారు. అయన రూపొందించిన నాటికలో ప్రధానమైనది 'మా భూమి' తర్వాత కాలంలో సినిమాగా కూడా వచ్చిందని చెప్పారు. డాక్టరుగా అతి తక్కువ ఫీజులతో ప్రజలకు వైద్యం అందించారని, నేటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో సాహిత్య రంగంలో ఎంతో కృషి చేయాల్సి అవసరం వుందని అన్నారు. కళలు, సాహిత్యం ద్వారా ప్రజల్లో చైతన్యం పెంపొందించటమే ఆయని ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. కార్యక్రమంలో ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు ఎస్‌.పద్మ, సిఐటియు నాయకులు కె.నళినీకాంత్‌, ముత్యాలరావు, బి.లక్ష్మణరావు, ఎస్‌.కె. ఖాశింవలి, ఖాశింషహీద్‌, ఎస్‌.ఎఫ్‌.ఐ జిల్లా కార్యదర్శి ఎం.కిరణ్‌, డివైఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్‌ వై.కష్ణకాంత్‌ పాల్గొన్నారు.
ప్రజాశక్తి - ఫిరంగిపురం : మండలంలోని పొనుగుపాడులో శుక్రవారం సభ నిర్వహించారు. రాజారావు చిత్రపటానికి ప్రజానాట్య మండలి గ్రామ అధ్యక్షులు క్రోసూరు వెంకట్రావు పూలమాలవేసి నివాళులర్పించారు. జిల్లా నాయకులు మస్తాన్‌వలి మాట్లాడుతూ కళ కళ కోసం కాదు కళ ప్రజల కోసమని రాజారావు నిరూపించారన్నారు. నటుడుగా, ప్రయోక్తగా, అనేక కళారూపాల ద్వారా తన జీవితాంతం ప్రజలను చైతన్యవంతం చేశారని అన్నారు. సినీ ప్రపంచానికి జగ్గయ్య, గుమ్మడి, జమున, కృష్ణ, నాగభూషణం, అల్లూ రామలింగయ్య తదితరులను అందించారని గుర్తుచేశారు. రాజారావు ఆశయాలను నేటి కళాకారులు కొనసాగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పి.కోటేశ్వరరావు, కె.సుబ్బారావు, జి.కోటేశ్వరరావు, జివి రావు, టి.పి పాల్గొన్నారు.
ప్రజాశక్తి - తాడేపల్లి రూరల్‌ : కొలనుకొండలో ప్రజానాట్య మండలి జిల్లా నాయకులు కంచర్ల కాశయ్య అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఇఫ్టా జాతీయ కార్యదర్శి గని మాట్లాడారు. ప్రజా పోరాటాలకు కళాకారులు వెన్నంటి ఉండాలని, అంతరించిపోతున్న కళలను బతికించుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యవంతం చేయాలని పిలుపునిచ్చారు. జి.సాంబిరెడ్డి, టి.వెంకటయ్య, చిన్నసత్యనారాయణ, జి.వెంకయ్య, బి.శ్రీనివా సరావు, ఎస్‌.శ్యామ్‌, ఎస్‌.అనిల్‌ పాల్గొన్నారు.