Sep 18,2023 00:13

ప్రజాశక్తి - రేపల్లె
ప్రజల స్వేచ్ఛ, హక్కుల కోసం చంద్రబాబు పోరాడుతున్నారని ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ అన్నారు. రాజకీయ కుట్రతోనే అరెస్టు చేశారని ఆరోపించారు. రిలే దీక్షా శిబిరంలో ఆదివారం ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన అనంతరం పారిశ్రామిక ప్రాంతమంతా హైదరాబాదులో ఉండిపోవడంతో రాష్ట్ర యువత భవిషత్ ను తీర్చిదిద్దాలని నిరుద్యోగులైన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నైపుణ్య శిక్షణా తరగతులను ఏర్పాటు చేశారని అన్నారు. సీమెన్స్, డిజైన్టెక్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని స్కిల్ డెవలప్మెంట్ శిక్షణా తరగతులు నిర్వహించినట్లు తెలిపారు. ఆర్థిక శాఖ కార్యదర్శి అజయ్ కల్లం క్యాబినెట్ తీర్మానంతో యువత భవిష్యత్ కు పునాదులు వేసి అభివృద్ధి చెయ్యటమే చంద్రబాబు చేసిన అవినీతా అని ప్రశ్నించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎటువంటి కుట్రలు లేవని ఆ సంస్థ ఎండి సుమన్ బోస్ పత్రికా ముఖంగా వెల్లడించారని చెప్పారు. 2లక్షల మంది శిక్షణ పొందగా 72వేల మంది మంచి స్థాయిలో సాఫ్ట్ వేర్‌లుగా ఉద్యోగాలు పొందారని చెప్పారు. జగన్మోహన్‌రెడ్డి సీఐడీ అధికారులను తన ఇంట్లో పనిమనుషులుగా మార్చి అక్రమ కేసులు పెట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. 38కేసుల్లో ముద్దాయిగా ఉండి, ఏ1 ముద్దాయిగా ఉన్న జగన్మోహన్‌రెడ్డి తాను 16 నెలలు జైల్లో ఉన్నాను కాబట్టి ప్రతిపక్ష నాయకులు క్లీన్‌గా ఉండకూడదనే దురుద్దేశంతో బాబుపై అక్రమ కేసులు పెట్టారని అన్నారు. ఏపీ రాజకీయాల్లో అత్యంత కీలకంగా చంద్రబాబు వ్యవహరిచారని గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నవ్యాంధ్రప్రదేశ్‌లలో 14ఏళ్లు సీఎంగా పనిచేసిన వ్యక్తిని జైలులో పెట్టి ఇబ్బందులు పెడుతుంటే తెలుగు ప్రజల హృదయాలు రగిలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి బద్రతలు క్షీణించాయని అన్నారు. కేసులు, అరెస్టులకు బెదిరేది లేదన్నారు. రానున్న ఎన్నికల్లో టిడిపి అధికారానికి వస్తుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంఎల్‌ఎ ముమ్మనేని వెంకట సుబ్బయ్య, పంతాని మురళీధరరావు, గూడపాటి శ్రీనివాసరావు, గోగినేని వసూద, జీవి నాగేశ్వరరావు, వెనిగళ్ళ సుబ్రహ్మణ్యం,  ధర్మతేజ పాల్గొన్నారు.