
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి కోర్టులో ప్రతి పిటిషన్‌కు రూ.1 స్టాంపుతోపాటు రూ.20ల వెల్ఫేర్ స్టాంపు తప్పనిసరి అంటూ ఎపి బార్ కౌన్సిల్ చేసిన నిర్ణయం పట్ల న్యాయవాదుల్లోనూ, ముద్దాయిల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఏదైనా కారణాలతో ముద్దాయి కోర్టుకు హాజరు కాలేనిపక్షంలో ఆప్సెంట్ పిటిషన్‌లను లాయర్లు వేస్తుంటారు. అదేవిధంగా సిఆర్‌ఎల్ ఎంపి, క్రిమినల్ మిసిలియన్స్ పిటిషన్, ఐఎ వంటి పిటిషన్లు తరచూ వేయాల్సి ఉంది. ఇప్పటి వరకూ రూ.1 వెల్ఫేర్ స్టాంపు ఉండేది. అయితే బార్ కౌన్సిల్ ఆఫ్ ఎపి ఇటీవల పిటిషన్లకు రూపాయి స్టాంపునకు బదులు రూ.20 స్టాంపు అతికించాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఒక్కొక్క లాయర్‌పై నెలకు సరాసరిన రూ.2 వేలు నుంచి రూ.3 వేలు వరకూ భారం పడుతుంది.
భారం పడుతుందని ఇలా...
సాధారణంగా బెయిల్ అప్లికేషన్, ప్రతి కొత్త కేసుకు న్యాయవాదులు రూ.100 వెల్ఫేర్ స్టాంపులు వినియోగించడం పరిపాటిగా వస్తోంది. తాజా నిర్ణయాన్ని ఈ నెల 5వ తేదీన అమలు చేశారు. కేవలం వారం రోజుల వ్యవధిలో జిల్లాపై రూ. 1 లక్ష భారం పడినట్లు న్యాయవాదులు చెబుతున్నారు. ముద్దాయి కోర్టుకు హాజరు కాలేని కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ముద్దాయి తరుపున న్యాయవాది కోర్టులో పిటిషన్ వేయాల్సి ఉంది. ప్రస్తుతం స్టేట్ బార్ కౌన్సిల్ నిర్ణయంతో రూ.20 అంటించాల్సి ఉంది. ఇలా ఒక లాయరు ఐదుగురు ముద్దాయిలకు ఆప్సెంట్ పిటిషన్ వేస్తే రూ.20 చొప్పున రూ.100 వెచ్చించాల్సిందే. పాత ధర ప్రకారం రూ.5లతో పిటిషన్లు వేసే వెసులుబాటు ఉండేది. ఈ భారమంతా పరోక్షంగా ముద్దాయిలపై, ప్రత్యక్షంగా న్యాయవాదులపై పడుతోంది. గత కొంతకాలంగా న్యాయవాదుల వెల్ఫేర్ కూడా అమలుకు నోచుకోవడం లేదని తెలుస్తోంది. గతలో అడ్వకేట్స్ ఎవరైనా చనిపోతే ప్రభుత్వం నుంచి రూ.4 లక్షలు, బార్ కౌన్సిల్ వెల్ఫేర్ ఫండ్ నుంచి మరో రూ.4 లక్షలు చొప్పున సహాయం అందించేవారు. గత కొంతకాలంగా మృతి చెందిన వారి కుటుంబాలకు ఈ వెల్ఫేర్ ఫండ్ బకాయిలు చెల్లించని పరిస్థితి ఉందని న్యాయవాదులు పేర్కొంటున్నారు.
రూ.20 పెంపు నిర్ణయాన్ని తక్షణమే రద్దు చేయాలి
రూ.1 ఉన్న వెల్ఫేర్ స్టాంపు ధరను స్టేట్ బార్ కౌన్సిల్ రూ.20లకు పెంచి సామాన్యులపై భారం మోపడం తగదు. ఈ నిర్ణయం న్యాయవాదులకు పెనుభారం కానుంది. నెలకు సరాసరిన వేలల్లో భారం పడే అవకాశం ఉంది. న్యాయవాదులను, ముద్దాయిలను ఇబ్బందులకు గురిచేసే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి.
-దాసరి రాంబాబు, న్యాయవాది, రాజమహేంద్రవరం