Aug 02,2023 23:20

ప్రారంభిస్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షులు జునైద్‌ అహ్మద్‌ మౌలానా

ప్రజాశక్తి - శ్రీకాకుళం : ఆర్థిక స్తోమత లేని కక్షిదారులకు ఉచితంగా న్యాయసేవలు అందిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షులు జునైద్‌ అహ్మద్‌ మౌలానా తెలిపారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ సిస్టమ్‌ను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసుల వాదనకు సొంత ఖర్చులతో న్యాయవాదిని పెట్టుకోలేని వారు దీన్ని ఉపయోగించుకోవచ్చని చెప్పారు. డిఫెన్స్‌ కౌన్సిల్‌ సిస్టమ్‌లో న్యాయవాదుల చీఫ్‌ లీగల్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ కొమరాపు ఆఫీసునాయుడు, డిప్యూటీ లీగల్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ పుట్టా అంజనీకుమార్‌, అసిస్టెంట్‌ లీగల్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ పైడి హర్షవర్థన్‌ ద్వారా ఉచితంగా కేసు నడిపిస్తామన్నారు. ఆర్థికస్తోమత లేని వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో అదనపు జిల్లా న్యాయమూర్తులు శ్రీదేవి, భాస్కరరావు, ఫణికుమార్‌, సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎం.అనురాధ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్‌.సన్యాసినాయుడు, బార్‌ కౌన్సిల్‌ స్టేట్‌ మెంబర్‌ గేదెల వాసుదేవరావు, బార్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు ఎన్ని సూర్యారావు, కార్యదర్శి పొన్నాడ రాము, న్యాయాధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు.