Nov 19,2022 00:15

ఇంటిని పరిశీలిస్తున్న సిపిఎం నేత సత్తిబాబు

ప్రజాశక్తి-నర్సీపట్నంటౌన్‌:20 ఏళ్లుగా ఇల్లు నిర్మించుకొని కాపురం ఉంటున్న ఒక పేద మహిళ ఇంటిని ప్రభుత్వ అధికారులు దగ్గరుండి కూల్చివేయడం కక్ష సాధింపు చర్యగా ఉందని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు డి.సత్తిబాబు అన్నారు. గొలుగొండ మండలం ఎల్లవరం గ్రామంలో ప్రభుత్వ అధికారులు దగ్గరుండి కూల్చి వేసిన పావడ వెంకటలక్ష్మి ఇంటిని సిపిఎం నాయకులు పరిశీలించారు. వెంకటలక్ష్మికి ఎటువంటి నోటీసు ఇవ్వకుండా ఇంటిని కూల్చి వేయడం దారుణమన్నారు. ఆమె ఇప్పుడు గుడిలో కాపురం ఉంటుందన్నారు. ఈ ఇంటిని కూల్చిన తర్వాత మరో ఆరు ఇల్లు ఖాళీ చేయమని నోటీసులు ఇచ్చారని తెలిపారు. ఇల్లు ఖాళీ చేయమనడం దారుణన్నారు. ఇప్పుడు నోటీసులు ఇచ్చిన ఇళ్లు ఉండటంతో ప్రభుత్వానికి ఎటువంటి నష్టం లేదని తెలిపారు. ఆయనతో పాటు శ్రీకాంత్‌ ఉన్నారు.
బాధిత మహిళకు న్యాయం చేయండి
ప్రజాశక్తి -నర్సీపట్నం టౌన్‌:గోల్కొండ మండలం మండలం కొత్తఎల్లవరం బాధిత మహిళ పావాడ వెంకటలక్ష్మీకి పునరావాసం కల్పించి మానవతా దృక్పదంతో న్యాయం చేయాలని జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్‌ రాజాన వీరసూర్యచంద్ర ఆర్డీవో జయరాంకు విజ్ఞప్తి చేశారు. ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆర్డీవోను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శు భాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ, పునరావాసం కల్పించకుండా పావాడ వెంకటలక్ష్మి ఇంటిని కూల్చివేశారని, ప్రస్తుతం ఆ కుటుంబం గుడిలో తలదాచుకునే పరిస్థితి ఉందన్నారు. కూల్చివేసిన ఇంటికి సంబంధించి ఇంటి పన్నులు కట్టించుకున్నారని, కరెంట్‌ బిల్లు వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం టౌన్‌ అధ్యక్షులు అద్దేపల్లి గణేష్‌, నాయకులు రేగుబల్ల శివ, గూడెపు తాతబాబు, రమణ, రాజు, నమ్మి మంగరాజు పాల్గొన్నారు.