Sep 21,2023 20:58

అనంతపురం నుంచి ప్రారంభం అయిన కిసాన్‌ రైల్‌ (ఫైల్‌ ఫొటో)

      అనంతపురం ప్రతినిధి : ఉద్యానవన రైతులకు మంచి గిట్టుబాటు ధర కల్పిస్తామంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కిసాన్‌ రైల్‌ పేరుతో మూడేళ్ల క్రితం హడావుడి చేశాయి. ముచ్చటగా మూడు రైళ్లు నడిపాయి. అంతలేని దానిని నడపలేక చేతులెత్తేశాయి. ప్రస్తుతం ఉద్యానవన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నా... పట్టించుకునే వారు లేరు. టమోటా లాంటి పంటలైతే ధరలేక రోడ్లపైనే పడేసే పరిస్థితి నెలకొంది.
ఉద్యానవన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కిసాన్‌ను రైల్‌ను 2020 సెప్టంబర్‌ తొమ్మిదవ తేదీన ప్రారంభించారు. అనంతపురం నుంచి నేరుగా ఢిల్లీకి ఈరైలు వెళ్లే ఏర్పాటు చేశారు. 332 టన్నులు టమోటా, అరటి, బత్తాయి, బొప్పాయి తదితర పంటలను ఎగుమతి చేశారు. ఆ తరువాత రెండు పర్యాయాలు ఇదే రకంగా ఎగుమతి చేశారు. అనంతరం దీని రప్పించి పంటలను పంపే ఏర్పాట్లపై ఎవరూ పట్టించుకోకుండా వదిలేశారు.
అంతన్నారు...ఇంతన్నారు..!
       కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తొమర్‌, రైల్వే శాఖ మంత్రి సురేష్‌ సి.అంగడి, ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి అధికారులందరూ కలసి పచ్చ జెండాను ఊపి కిసాన్‌ రైల్‌ను ప్రారంభించారు. ఈ సమయంలో కాసన్‌ ఉడాన్‌, కిసాన్‌ రైల్‌ను నడుపుతున్నట్టు తొమర్‌ తెలిపారు. కిసాన్‌ రైల్‌ వల్ల వ్యవసాయ ఆర్థికాభవృద్ధి ఉపయోగపడుతుందని చెప్పారు. అగ్రికల్చర్‌ ఇన్‌ప్రాస్ట్రక్చర్‌ ఫండ్‌ కింద లక్ష కోట్ల నిధులు కేటాయించినట్టు పేర్కొన్నారు. అయితే ఇవన్నీ ఉత్తుత్తి మాటలుగానే మిగిలిపోయాయి.
ఉద్యానవపంటలకు అనంత ప్రసిద్ధి
       ఉమ్మడి అనంతపురం జిల్లా ఉద్యానవ పంటలకు ప్రసిద్ధి. సుమారు నాలుగున్నర లక్షల ఎకరాల్లో ఈ పంటలు సాగవుతాయి. ఏడాదికి సుమారు 58 లక్షల మెట్రిక్‌ టన్నులు పండ్లు, కాయగూరలు, పూలు దిగుబడి వస్తాయి. రాష్ట్రంలో వచ్చే దిగుబడుల్లో 80 శాతం ఇక్కడే పండుతాయి. ఒక్కోసారి పంటలకు ధర ఉండటం లేదు. ప్రధానంగా టమోటా పంట ఏటా ధర లేక రోడ్డుపై పడేస్తున్నారు. ఈ ఏడాది కూడా ఆగస్టు వరకు ధర అధికంగా ఉండేది. ఆ తరువాత నుంచి ధర పడిపోయింది. కొనేవాళ్లు లేక రోడ్డుపై టమోటాలను పడేస్తున్నారు. ఈ సమయంలో ధరవున్న ప్రాంతాల్లోకి ఈ పంటను తరలించే ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏవీ లేకపోవడం గమనార్హం.
ప్రచారానికే పరిమితమైన కిసాన్‌ రైల్‌
శివారెడ్డి ఎపి పండ్లతోటల రైతు సంఘం జిల్లా నాయకులు.

      ఎంతో ఆర్భాటంగా కిసాన్‌ రైల్‌ను అప్పుడు ప్రారంభించారు. ఇది ప్రచారానికే తప్పా రైతులకు ఉపయోగ పడింది ఏమీ లేదు. రైలు ముందుగా బుక్‌ చేసుకుంటేనే కిసాన్‌ రైల్‌ను పంపుతారు. దానికంటే ప్రత్యేకమైన వ్యవస్థ ఏదీ లేదు. ముందు నుంచి తాము సూచిస్తున్నది ఒక్కటే సాధారణ రైళ్లలోనే రెండు బోగిలను పంటల ఎగుమతులకు ఏర్పాటు చేయాలని, అది చేయడం లేదు. రవాణా ఛార్జీలను కూడా తగ్గించాలి. ఇలా చేస్తే ఉద్యానవన రైతులకు కొంత ఉపయోగంగా ఉంటుంది.