గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామారావు
ప్రజాశక్తి-రాజవొమ్మంగి
అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న లోదొడ్డి పంచాయతీ పర్వత ప్రాంతమైన కిండంగి గ్రామంలో మౌలిక వసతులు కల్పించాలని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు డిమాండ్ చేశారు. శనివారం గిరిజన సంఘం నాయకులు కిండంగి గ్రామంలో పర్యటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆ గ్రామ గిరిజనులు పలు సమస్యలను గిరిజన సంఘం దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా లోతా రామారావు మాట్లాడుతూ గ్రామానికి విద్యుత్ సదుపాయం లేక గిరిజనులు రాత్రి వేళ చీకటిలోనే బిక్కు బిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి రహదారి సౌకర్యం, తాగునీరు సౌకర్యం లేక గిరిజనులు ఐదు కిలోమీటర్లు నడకే శరణ్యమని పేర్కొన్నారు. గ్రామ శివారులో ఉన్న చెలమనీటిని గిరిజనులు సేవించవలసి వస్తుందన్నారు. గిరిజనులు అనారోగ్యం బారిన పడితే వైద్య సహాయం కోసం 5 కిలోమీటర్లు కొండ గిదివచ్చి, 25కిలోమీటర్లు ఆటోలో జడ్డంగి వెళ్ళాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 5న నిండు గర్భిణీకి పురిటి నొప్పులు వస్తే అర్థరాత్రి 12 గంటలకు 5 కిలోమీటర్లు గిరిజనులు జోలుకట్టి తీసుకొని రావలసిన పరిస్థితి దాపురించిందని తెలిపారు. ఇటువంటి సమస్యలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఉన్నత అధికారులు గ్రామంలో మౌలిక వసతులు కల్పించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మండల సహాయ కార్యదర్శి జర్త రాజబాబు, గెమ్మెల రంగారావు, గెమ్మెల లింగ్, చిట్టిబాబు పాల్గొన్నారు.










