Jul 07,2023 00:45
వైద్య శిబిరంలో రోగులను పరీక్షిస్తున్న డాక్టర్‌

ప్రజాశక్తి-పంగులూరు: పంగులూరు మండలంలోని నూజెళ్లపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ వైసిపి నాయకులు కొండ్రగుంట రవిబాబు, తాళ్లూరి నరేంద్ర ఆధ్వర్యంలో కిమ్స్‌ హాస్పిటల్స్‌ ఒంగోలు సహకారంతో గురువారం నిర్వహించిన వైద్య శిబిరంలో 220 మందికి పరీక్షలు నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిర్వహించిన ఈ ఉచిత వైద్య శిబిరానికి ప్రజల భారీగా హాజరైనట్లు కిమ్స్‌ వైద్య శిబిర సమన్వయకర్త తాళ్లూరి రామాంజనేయులు, కిమ్స్‌ అద్దంకి ఏరియా పిఆర్‌ఓ పి కాలేషావలి తెలియజేశారు. ఈ వైద్య శిబిరంలో కిమ్స్‌ వైద్యులు డాక్టర్‌ బైపనేని రామాంజనేయులు సుమారు 220 మంది రోగులకు బిపి, షుగర్‌, ఈసీజీ పరీక్షలు నిర్వహించి, వారికి ఒక వారం రోజులకు సరిపడా మందులను కూడా ఉచితంగా అందజేశారు. ఈ వైద్య శిబిరంలో సుమారు 20 మందికి కంటి లోపల శుక్లములు, పొరలు ఉన్నవారికి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఒంగోలులోని కిమ్స్‌ హాస్పిటల్స్‌లో ఉచితంగా ఆపరేషన్స్‌ నిర్వహిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో నూజెళ్లపల్లి సచివాలయం ఏఎన్‌ఎం లత, ఆశ వర్కర్లు, కిమ్స్‌ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.