Jul 25,2023 22:26

టమాటాలను అందజేస్తున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌

*రైతుబజారులో విక్రయ కేంద్రం ప్రారంభం
*త్వరలో అన్ని పట్టణాల్లో విక్రయ కేంద్రాలు
*కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌
ప్రజాశక్తి - శ్రీకాకుళం :
జిల్లా ప్రజల సౌకర్యార్థం కిలో టమాటాను సబ్సిడీపై రూ.50కే లభ్యమయ్యేలా విక్రయ కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ తెలిపారు. స్థానిక రైతుబజారులో వ్యవసాయ మార్కెటింగ్‌శాఖ ఏర్పాటు చేసిన సబ్సిడీపై టమాటా విక్రయ కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్‌ ప్రారంభించారు. కొనుగోలుదారులకు టమాటాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వారాలుగా దేశవ్యాప్తంగా టమాటా ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో కిలో టమాటా రూ.120కు చేరుకుందని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజల సౌకర్యార్థం మార్కెటింగ్‌ శాఖ ఆధ్వర్యాన చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి టమాటాలను సేకరించి సబ్సిడీపై విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తొలివిడతగా జిల్లాకు ఐదు వేల టన్నుల టమాటాలను దిగుమతి చేసుకున్నామని, వీటిని పట్టణ ప్రజల సౌకర్యార్థం అందుబాటులో ఉంచామన్నారు. ప్రజలందరికీ లభ్యమయ్యేలా ఒకరికి కేజీ మాత్రమే కొనుగోలు చేసుకునేలా పరిమితి విధించినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో జిల్లాకు మరిన్ని టమాటా లోడులను దిగుమతి చేసుకొని ప్రజలకు లభ్యమయ్యేలా చూస్తామన్నారు. సబ్సిడీ సౌకర్యాన్ని పట్టణ ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు. ఇటువంటి కేంద్రాల ద్వారా బహిరంగ మార్కెట్‌లో టమాటా ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుందని తెలిపారు. త్వరలో ఆమదాలవలస, పలాస ఇతర పట్టణాల్లో విక్రయ కేంద్రాల ఏర్పాటు చేస్తామని చెప్పారు. రైతుబజారులో మురుగునీటి కాలువలు, వర్షపు నీటి సమస్యల వల్ల ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నట్లు కలెక్టర్‌ దృష్టికి తీసుకురాగా, వాటిని శాశ్వత లేదా తాత్కాలిక ప్రాతిపదికన పనులు చేపడతామన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ సహాయ సంచాలకులు ఎం.కాళేశ్వరరావు, రైతుబజారు ఎస్టేట్‌ అధికారి రాజశేఖర్‌, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.