Apr 26,2023 00:22

జెండా ఊపి ర్యాలీని ప్రారంభిస్తున్న పిఒ అభిషేక్‌

ప్రజాశక్తి-పాడేరు టౌన్‌
కీటక జనిత వ్యాదులపై అప్రమత్తంగా ఉండాలని ఐటిడిఎ పిఒ వి.అభిషేక్‌ అన్నారు. మలేరియా నివారణ బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. మంగళవారం ప్రప్రంచ మలేరియా దినోత్సవం సందర్బంగా స్థానిక అంబేడ్కర్‌ కూడలి వద్ద మలేరియా నివారణపై అవగాహనా ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రాంభించారు. ఈ సందర్భంగా పిఒ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాలలో మలేరియా నివారణ చర్యలపై అవగాహన కల్పించాలన్నారు. దోమల పెరుగుదలను అరికట్టడానికి డ్రైడేలను పక్కాగా అమలు చేయాలని సూచించారు. ఇంటి పరసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఎక్కడా నీటి నిల్వలు లేకుండా నివారణ చర్యలు చేపట్టాలని చెప్పారు. శుక్రవారం, సోమవారం, బుధవారాలలో డ్రైడే పాటించాలని స్పష్టం చేసారు. దోమ తెరల వినియోగంపై గిరిజనులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ర్యాలీని అంబేడ్కర్‌ కూడలి నుండి ఐటిడిఎ కార్యాలయం వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి సాంబమూర్తి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
డుంబ్రిగూడ:ప్రపంచ మలేరియా దినోత్స వాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి పి.రాంబాబు ఆధ్వర్యంలో మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి మూడు రోడ్ల జంక్షన్‌ మీదుగా బిఎస్‌ఎన్‌ఎల్‌ సెల్‌ టవర్‌ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వైద్యాధికారి రాంబాబు మాట్లాడుతూ, చలి జ్వరం వస్తే వెంటనే దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి మలేరియా పరీక్షలు చేయించు కోవాలన్నారు. దోమలు కుట్టడంతో మలేరియా జ్వరం వస్తుందన్నారు. ప్రభుత్వం పంపిణీ చేసిన దోమతెరలను వినియోగించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో హెల్త్‌ సూపర్వైజర్లు సాంబశివరావు, రామారావు పాల్గొన్నారు.
మారేడుమిల్లి : మండలంలోని స్థానిక పోలీస్‌ స్టేషన్‌ కూడలి వద్ద అంతర్జాతీయ మలేరియా దినోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం వైద్యులు వై.హరికృష్ణ, మలేరియా టెక్నికల్‌ సూపర్‌వైజర్‌ కె.ఆదిరెడ్డి, మెడికల్‌ సిబ్బంది ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. దోమతెరలు వాడండి మలేరియాను తరమండి అంటూ వీధుల్లో తిరుగుతూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మండల అడ్మినిస్ట్రేషన్‌ అధికారి వైవిఎస్‌ రమణమూర్తి మాట్లాడుతూ ఇంటి చుట్టుపక్కల మురికి గుంతలు లేకుండా చూసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఈ వ్యాధిపై అవగాహన కలిగి ఉండి మలేరియా లక్షణాలు ఉంటే వెంటనే ఆసుపత్రికి రావాలని కోరారు. డాక్టర్‌ వై హరికృష్ణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రభుత్వం మంజూరు చేసిన దోమతెరలు వాడాలన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, ఆశ వర్కర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.