Aug 16,2023 00:31

జెండా వందనం చేస్తున్న పల్నాడు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కారుమూరు వెంకట నాగేశ్వరరావు కలెక్టర్‌ శివశంకర్‌, ఎస్పీ రవిశంకర్‌రెడ్డి,

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లా అంటేనే అన్ని వర్గాల ప్రజల హితం కోరే జిల్లాగా, పౌరుషాల పురిటి గడ్డగా కీర్తి ప్రతిష్టలు గాంచిందని జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలోని సత్తెనపల్లి రోడ్డులో గల జిల్లా క్రీడా ప్రాంగణంలో మంగళవారం జరిగిన 77వ స్వాతంత్య్ర దినోత్సవాలకు ఆయన ముఖ్యఅతిథఙగా హాజరై జెండాను ఎగురవేశారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా ప్రగతిని వివరించారు. తొలుత మంత్రికి జిల్లా కలెక్టర్‌ శివశంకర్‌ లోతేటి, జిల్లా ఎస్పీ రవిశంకర్‌రెడ్డి, జెసి శ్యామ్‌ ప్రసాద్‌, ట్రైనీ కలెక్టర్‌ కల్పశ్రీ, డిఆర్‌ఒ వినాయకం ఘన స్వాగతం పలికారు. సంక్షేమ, అభివృద్ధి శకటాలు, స్టాల్స్‌ ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. పలువురు ప్రదర్శించిన విన్యాసాలు, విద్యార్థుల నత్య ప్రదర్శనలను తిలకించి, ఉత్తమ సేవలను అందించిన అధికారులకు సేవా పురస్కారాలను, అవార్డులను, ప్రశంసా పత్రాలను మంత్రి ప్రదానం చేశారు. ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు కలిసి స్వాతంత్య్ర సమర యోధుల కుటుంబాలను సత్కరించారు. సాంస్కృతిక ప్రదర్శనల్లో విజేతలుగా నిలిచిన వివిధ పాఠశాలల విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. డీఎల్పీవో కార్యాలయంలో జెండాను డీఎల్పీవో డాక్టర్‌ పి.రమణయ్య ఎగురవేశారు. హరికృష్ణ, శ్రీనివాసరావు, అపర్ణ, సూరయ్య పాల్గొన్నారు.