కీర్తి కుటుంబాన్ని ఆదుకుందాం
ప్రభుత్వం తరపున రూ.5 లక్షలు, శ్రీసిటీ రూ.50వేలు అందజేత
ప్రజాశక్తి - పిచ్చాటూరు
తాను మరణించినా, తన అవయవాలతో ఏడుగురికి పునర్జన్మనిచ్చిన కీర్తి కుటుంబాన్ని మరోసారి కీర్తించారు. పిచ్చాటూరు మండలం రామాపురం దళితవాడకు చెందిన సి.సంపత్‌కుమార్, అమ్ములు దంపతులకు సిఎం రిలీఫ్‌ఫండ్ కింద రూ.5 లక్షల చెక్కును బుధవారం ఎంఎల్‌ఎ కోనేటి ఆదిమూలం అందజేశారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ అవయవదానం చేసిన కీర్తి విషయం తనకు తెలిసిన వెంటనే సిఎం కార్యాలయంతో నేరుగా సంప్రదించి సిఎం రిలీఫ్‌ఫండ్ నుంచి ఐదు లక్షల రూపాయల చెక్కును మంజూరు చేయించినట్ల చెప్పారు. ఓ నిరుపేద దళిత కుటుంబంలో జన్మించిన యువతి మరణిస్తూ సైతం మరో ఏడుగురికి ఊపిరి పోసిందని, కీర్తి స్ఫూర్తి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఉండటానికి కనీసం సక్రమమైన ఇల్లు లేకపోయినా పిల్లల చదువుల కోసమే ఆ తల్లిదండ్రులు కష్టపడ్డారని, చేతికంది వచ్చిన కీర్తి ప్రమాదవశాత్తు మృతిచెందడం ఆ కుటుంబానికి తీరని లోటన్నారు. అవయవదానంతో వారు చూపిన మార్గం ఎందరికో మార్గదర్శకమన్నారు. చెన్నై జీహెచ్ వైద్యులు కీర్తి శరీరం నుంచి గుండె, రెండు మూత్రపిండాలు, రెండు కళ్లు, గుండె వాల్వు, కాలేయం, మూత్రనాళాలు, ఊపిరితిత్తులను అవయవ దానం ద్వారా స్వీకరించి ఏడుగురికి అమర్చారన్నారు. 18 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత ఎవరైనా అవయవ దానం కోసం తమను తాము నమోదు చేసుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్క పౌరుడిపై ఉందని గుర్తు చేశారు. అదేవిధంగా శ్రీ సిటీ తరఫున 50 వేల రూపాయలు శ్రీ సిటీ ఎండి రవీంద్ర సన్నారెడ్డి సౌజన్యంతో కీర్తి కుటుంబానికి అందించామన్నారు... ఇంకా మనసున్న మారాజులు స్పందించి కీర్తి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవాలని ఆదిమూలం పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ మధుసూదన్ రావు, పార్టీ అధ్యక్షుడు చాలపతి రాజు, రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ నాయుడు, ఎంపీటీసీ రమేష్ రాజు, తొప్పయ్య, మోహన్, సుబ్రమణ్యం రెడ్డి, బాబు రెడ్డి పాల్గొన్నారు.










