Jul 20,2023 00:17

సమావేశంలో మాట్లాడుతున్న విఎంఆర్‌డిఎ జాయింట్‌ కమిషనర్‌ రవీంద్ర

ప్రజాశక్తి - గ్రేటర్‌ విశాఖ బ్యూరో
విశాఖపట్నం మెట్రో రీజనల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (విఎంఆర్‌డిఎ) పరిధిలో పలు కీలక ప్రాజెక్టులు ముందుకు సాగుతున్నాయని వుడా జాయింట్‌ కమిషనర్‌ రవీంద్ర వెల్లడించారు. బుధవారం సాయంత్రం విఎంఆర్‌డిఎ కాన్ఫెరెన్సు హాలులో కార్యదర్శి రంగయ్య, ఇంజినీరింగ్‌ ఉన్నతాధికారులతో పాటు నిర్వహించిన మీడియా సమావేశంలో పలు అంశాలను ప్రస్తావించారు. జగనన్న 1 సెంటు లే-అవుట్లు ప్రగతి పథంలో ఉన్నాయని, 4825 ఎకరాల్లో రూ.175కోట్లతో లక్షా 41వేలా 654 ప్లాట్లను ఏర్పాటుచేశామని తెలిపారు. ఈ లే-అవుట్లకు భూములిచ్చిన రైతులకు రూ.20 కోట్లతో లే-అవుట్లను నిర్మించి అందజేస్తున్నామన్నారు. ఎంఐజి లే-అవుట్‌లకు సంబంధించి భోగాపురం చోడిపల్లి వద్ద కొంత సమస్య ఉందని, రఘుమండ, పాలవలసలో పనులు క్లియర్‌ చేస్తున్నామని చెప్పారు. విఎంఆర్‌డిఎ కీలక ప్రాజెక్టుల్లో నగరం నడిబొడ్డున 11 ఫ్లోర్ల మల్టీలెవెల్‌ పార్కింగ్‌, కమర్షియల్‌ వినియోగం కోసం రూ.80కోట్లతో నిర్మిస్తున్నామని, ఈ డిసెంబరు నాటికి పనులు పూర్తికానున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు ఎకరా 35 సెంట్లలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీంట్లో 430 కార్లు, 400 టూ వీలర్లు, 5 ఫ్లోర్లలో పార్కింగ్‌ చేసుకోవచ్చన్నారు.
ఎక్కడెక్కడ ప్లాట్లు?
జగనన్న ఎంఐజి స్మార్ట్‌ టౌన్‌షిప్‌లు విజయనగరంలోని నెల్లిమర్ల రఘుమండలో 287 ప్లాట్లు 22.50 సెంట్లలోనూ, గజపతినగరం మండలం జియ్యన్నవలసలో 12.31 ఎకరాల్లో 152 ప్లాట్లు, గరివిడి మండలంలోని 21.30 ఎకరాల్లో 272 ప్లాట్లు, విశాఖపట్నం జిల్లా అనందపురంలో పాలవలస 1, 2లో 76.96 ఎకరాల్లో 446 ప్లాట్లు, చోడవరం మండలంలోని అడ్డూరు వద్ద 20 ఎకరాల్లో 165 ప్లాట్లు, అనకాపల్లి మండలం అచ్యుతాపురం, భోగాపురం మండలం చోడిపల్లిలో 51.89 ఎకరాల్లో 189 ప్లాట్లు మొత్తంగా 204.96 ఎకరాల్లో 1505 ప్లాట్లు నిర్మిస్తున్నామన్నారు.
పలు ప్రాజెక్టులు వివిధ దశల్లో...
కన్వెన్షన్‌ సెంటర్ల నిర్మాణాల విషయానికొస్తే విశాఖ ఎంపీ నిధులు రూ.2కోట్లు, విఎంఆర్‌డిఎ నిధులు రూ.3.95కోట్లతో 1000 మందికి సరిపడా జి ప్లస్‌ 1 ఆడిటోరియాన్ని పెందుర్తి మండలం చీమలాపల్లి గ్రామంలో నిర్మిస్తున్నామని తెలిపారు. ఎంపీ నిధులు రూ.2కోట్లు, విఎంఆర్‌డిఎ నిధులు రూ.4.87 కోట్లతో ఎండాడ వద్ద 1000 మంది సామర్థ్యం కలిగిన ఆడిటోరియం నిర్మాణంలో ఉందన్నారు. ఎన్‌ఎడి వద్ద రూ.28కోట్లతో నిర్మిస్తున్న ఆర్‌ఒబి ప్రాజెక్టు 2024 జనవరి నాటికి పూర్తికానుందన్నారు. ఈ బ్రిడ్జి కొన్ని సాంకేతిక కారణాల వల్ల జాప్యం జరిగిందని చీఫ్‌ ఇంజినీరు వెల్లడించారు. ఎంజిఎం పార్కు (విశాఖ బీచ్‌)వద్ద నేచురల్‌ హిస్టరీ పార్కు రూ.88కోట్లతో బీచ్‌లో 15 మీటర్లు వెళ్లేలాగ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను కేంద్రానికి పంపామన్నారు. ఓసెన్‌ డెక్‌ బీచ్‌ పార్కును కూడా రూ.7.80కోట్లతో షిప్‌లో హోటల్‌ను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. కైలాసగిరి కొండపై ప్లానటోరియం విషయంలో ఇటీవలే కేంద్రం నుంచి సైన్స్‌ బృందం వచ్చి పరిశీలించి వెళ్లిందన్నారు. ఇక్కడ ప్రాజెక్టు సైన్సు సిటీ పేర రూ.5కోట్లతో ఎకరా స్థలంలో ఎపి ప్రభుత్వం సైన్సు సిటీ సంస్థతో అగ్రిమెంట్‌ చేసుకుంటుందని వివరించారు.