ప్రజాశక్తి -రంపచోడవరం
మండలంలోని కాకవాడ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికోన్నత పాఠశాలలో బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆ పాఠశాల హెచ్‌ఎం భర్త ప్రసాద్‌పై ఎట్టకేలకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని రంపచోడవరం ఎస్సై మోహన్ కుమార్ ఆదివారం ధ్రువీకరించారు. ఈ కేసులో నిందితుడిని ఇంకా అరెస్టు చేయలేదని పోలీసులు పేర్కొన్నారు. ఈ పాఠశాలలో ఇటీవల జరిగిన ఘటనకు సంబంధించి ఎస్టీ కమిషన్ చైర్మన్ పర్యటన అనంతరం ప్రభుత్వ యంత్రాంగంలో కదలికలు వచ్చాయి. కాకవాడ బాలికల ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం భర్త ప్రసాద్ అదే పాఠశాలలో గిరిజన బాలికలను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు రావడంతో గిరిజనులు, గిరిజన సంఘం నేతలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభ రవిబాబు స్పందించి పాఠశాలలు సందర్శించారు. దీంతో అధికారులు, పోలీసులు ఈ కేసుపై స్పందించి విచారణ చేస్తున్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రసాద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్ని వర్గాల నుంచి డిమాండ్ రావడంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ను మార్పు చేశారు. ముందు వేసిన ఎఫ్‌ఐఆర్‌కు (447, 324, 323, 506 ఆర్/డబ్ల్యు 34 ఐపిసి)కి అదనంగా పోక్సో యాక్ట్, 354సి, 354, సెక్షన్లతో రంపచోడవరం పోలీసులు ఆల్టర్ చేశారు. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రసాద్ ఇంకా పరారీలో ఉన్నాడు. కాకవాడ పాఠశాల హెచ్‌ఎం కుంజం పావని, వార్డెన్ కొమరం బాపనమ్మను ఐటీడీఏ అధికారులు సస్పెండ్ చేశారు. కాగా అనధికారికంగా కొనసాగుతున్న హెచ్‌ఎం సోదరి కుంజం సీతాదేవిని మారేడుమిల్లి మండలం వేటుకూరుకు బదిలీ చేసినట్టు అధికారులు తెలిపారు.










