- జిల్లా జడ్జి జస్టిస్ జునైద్ అహ్మద్ మౌలానా
- 653 మందికి రక్త పరీక్షలు
ప్రజాశక్తి- కవిటి, కంచిలి: ప్రభుత్వం కిడ్నీ వ్యాధులపై ప్రత్యేక దృష్టిసారించి, పూర్తిస్థాయిలో నియంత్రణ చర్యలు తీసుకుంటోందని జిల్లా జడ్జి జస్టిస్ జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. కవిటి మండలం మాణిక్యపురం, కంచిలి మండలం ఎంఎస్‌పల్లిలో జిల్లా జడ్జి ఆధ్వర్యాన శనివారం వైద్య శిబిరం, న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ కిడ్నీ వ్యాధి నివారణకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా దేశంలోనే మొదటిసారిగా కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నిర్మాణం పలాసలో జరుగుతోందని, ఆ పనులు పూర్తయితే కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మరింత ఊరట లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా గ్రామాల్లో ఉన్న వ్యాధి తీవ్రతను బట్టి ప్రతి ఒక్కరూ వ్యక్తిగత ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకోవాలని సూచించారు. అనారోగ్యానికి గురైనవారు కచ్చితంగా కిడ్నీ పరీక్షలు నిర్వహించుకోవాలని, వ్యాధి తీవ్రతను ముందే గుర్తిస్తే మెరుగైన వైద్యంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని అన్నారు. అంతేకాకుండా అతిగా నొప్పి నివారణ మందులు వాడడం, డాక్టర్లతో సంప్రదించకుండా మందుల దుకాణాల్లో మందులు కొనుక్కుని వాడడం ఆరోగ్యానికి ప్రమాదకరమని హెచ్చరించారు. జిల్లాలో ప్రతీ ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్యులు పనిచేస్తున్నారని, ఎటువంటి అనారోగ్యానికి గురైనా సంబంధిత వైద్యులను సంప్రదించాలని సూచించారు. అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎస్.అనురాధ మాట్లాడుతూ ముందుగా కిడ్నీ వ్యాధిపై ఉన్న అపోహలు తొలగించుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన వైద్య శిబిరంలో 653 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. వీరిలో సుమారు 15 మంది కొత్తగా కిడ్నీ వ్యాధికి గురైనట్టు పిహెచ్‌సి వైద్యులు భాస్కర్ తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి ఆర్.సన్యాసినాయుడు, సోంపేట సీనియర్ సివిల్ జడ్జి జె.శ్రీనివాసరావు, ఇచ్ఛాపురం మెజిస్ట్రేట్ పి.పరేష్ కుమార్, నెఫ్రాలజిస్ట్ విద్యాసాగర్, కంచిలి ఎంపిపి దేవదాస్ రెడ్డి, ఎంపిడిఒ పి.సూర్యనారాయణ రెడ్డి, పిఎసిఎస్ అధ్యక్షుడు దేవరాజ్ సాహు, ప్రభుత్వ వైద్యులు డాక్టర్ రామ్‌జీ, కె.ధనలక్ష్మి, వైద్య సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.










