Aug 21,2023 23:01

రోగితో మాట్లాడుతున్న నెప్రాలజిస్టు వైద్యులు

ప్రజాశక్తి- పలాస: పలాస ప్రభుత్వాస్పత్రిలోని డయాలసిస్‌ కేంద్రాన్ని చిన్నపిల్లల కిడ్నీవ్యాధుల నిపుణులు డాక్టర్‌ అనిషా (పెడియాట్రిక్‌ నెఫ్రాలజిస్టు యూనివర్శిటీ ఆఫ్‌ నార్తు కరోలిన, అమెరికా), డాక్టర్‌ నివేదిత (నెఫ్రాలజిస్టు, సెయింట్‌ జాన్స్‌ మెడికల్‌ కళాశాల బెంగుళూరు), ఐసిఎంఆర్‌ డాక్టర్‌ బాలాజీలు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కిడ్నీ రోగులకు అందుతున్న డయాలసిస్‌ సేవలను అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి సేవలు అందజేస్తున్నా రు... ఎన్ని రోజులు డయాలసిస్‌ కోసం కేంద్రానికి వస్తున్నారు.. రోగులకు ఏయే మందులు అందజేస్తున్నారు వంటి వివరాలు సేకరించారు. డయాలసిస్‌ కేంద్రంలో రోగులకు అందుతున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం 200 పడకల ఆస్పత్రి, కిడ్నీ పరిశోధన కేంద్రం భవన నిర్మాణ పనులను పరిశీలించారు. పలాస ప్రభుత్వాస్పత్రిలో వైద్య సిబ్బందితో సమావేశమై కిడ్నీ రోగులకు అందజేయాల్సిన సేవలను వివరించారు. 12 నుంచి 25 ఏళ్ల వయసు లోపు వారికి కిడ్నీ వ్యాధి సోకడంపై ఆందోళన వ్యక్తం చేశారు. వైద్యుల నుంచి సమాచారం సేకరించి వైద్య బృందం ఉద్దాన ప్రాంతంలో గల పలు గ్రామాల్లో వారం రోజుల పాటు పర్యటించి చిన్నారుల నుంచి యువతకు సోకే కిడ్నీవ్యాధిపై సమగ్ర వివరాలు సేకరిస్తామని చెప్పారు. వారుతో పాటు ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నూక కూర్మారావు, డాక్టర్‌ గీత, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌ డబ్బీరు భవానీశంకర్‌, కౌన్సిలర్‌ సవర సోమేశ్వరరావు పాల్గొన్నారు.
విద్యార్థులకు అవగాహన
నేషనల్‌ ఇనుస్యుట్‌ ఆఫ్‌ జార్జ్‌ ఇనుస్యూట్‌ గ్లోబల్‌ హెల్త్‌ సంయుక్తంగా చేపట్టిన సికెడియు ప్రాజెక్టు ద్వారా రంగోయి జెడ్‌పిహెచ్‌ స్కూల్‌లో 8,9,10 విద్యార్థులతో కిడ్నీ క్రానికల్‌ వ్యాధిపై అవగాహనా సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్‌ అనిషా మాట్లాడుతూ ఎక్కువగా పౌష్టికాహారం, నీటిని తీసుకోవాలన్నారు. రోజూ వ్యాయామం చేయాలన్నారు. కార్యక్రమంలో డోపా నైవా, డాక్టర్‌ నివేదిత, ఎం.బాలాజీ, ఎం.వి.సత్యనా రాయణ, స్వరూప, రాణి, ప్రభ పాల్గొన్నారు.