Mar 10,2023 00:00

సమావేశంలో మాట్లాడుతున్న అపోలో వైద్య బృందం

ప్రజాశక్తి - ఆరిలోవ : ప్రపంచ దేశాలతో పాటు భారతదేశంలో కూడా కిడ్నీ వ్యాధిగ్రస్తులు రోజురోజుకూ పెరుగుతున్నారని, ఈ వ్యాధి బారిన పడకుండా అవగాహన పెంచుకోవడం అవసరమని ది అపోలో యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌, ప్రముఖ నెఫ్రాలజిస్ట్‌ డాక్టర్‌ రవిరాజు అన్నారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆరిలోవ హెల్త్‌సిటీ అపోలో ఆసుపత్రిలో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ రవిరాజు తాటపూడి, డాక్టర్‌ పిఎస్‌.వంశీధర్‌, డాక్టర్‌ నాయుడు ఎన్‌ చితికేలా, డాక్టర్‌ సందీప్‌ మహేశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ, అధిక రక్తపోటు, మధుమేహం వల్ల కిడ్నీ సంబంధిత వ్యాధులు ఎక్కువగా నమోదవుతున్నాయని తెలిపారు. అధిక రక్తపోటు, మధుమేహం, 40 ఏళ్లు పైబడిన వారు తరుచూ సికెడి స్క్రీనింగ్‌ పరీక్షలు చేయించుకోవడం ద్వారా ముందుగా కిడ్నీ వ్యాధిని గుర్తించవచ్చని చెప్పారు. ప్రపంచంలో ప్రతి పది మందిలో ఒకరు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని తెలిపారు. ప్రారంభ దశలోనే దీన్ని గుర్తిస్తే ప్రాణపాయ స్థితి నుంచి తప్పించుకోవచ్చన్నారు. మంచి ఆహార అలవాట్లు, వ్యాయామం, ఉప్పు వాడకాన్ని తగ్గించుకోవడం, మానసిక ప్రశాంతత అలవర్చుకుంటే కిడ్నీ సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండవచ్చని చెప్పారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యశ్రీ ద్వారా డయాలసిస్‌ సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించడం శుభపరిణామమన్నారు. ఈ సమావేశంలో నెఫ్రాలజిస్ట్‌ డాక్టర్‌ అనీల్‌ కుమార్‌ పాత్రో తదితరులు పాల్గొన్నారు.