ప్రజాశక్తి-ఏ కొండూరు
కిడ్నీ వ్యాధులు ఉన్నవారు ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి ఆర్థికంగా నష్టపోవద్దని, విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా కిడ్నీ వ్యాధికి నాణ్యమైన వైద్యం చేస్తున్నారని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు కిడ్నీ వ్యాధిగ్రస్తులకు సూచించారు. శనివారం ఏ కొండూరు మండలంలోని కిడ్నీ వ్యాధి బాధిత తండా మాన్సింగ్ తండాలో ఆయన కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న బాధితులతో మాట్లాడారు. కిడ్నీ వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని పర్యటనలో భాగంగా ఆయన ముందుగా మాన్సింగ్ తండా వచ్చారు. అక్కడ ఆయన కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న గిరిజనులను వారి ఆరోగ్య పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులు విజయవాడలోని ప్రైవేటు ఆసుపత్రులలో వైద్యం చేయించుకుంటున్నామని కలెక్టర్ కు చెప్పగా అందుకు ఆయన స్పందించి ప్రైవేట్ ఆస్పత్రిలో చేసే వైద్యానికి దీటుగా విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నేఫ్రాలజిస్టులు వైద్యం చేస్తున్నారని, ప్రైవేటు ఆసుపత్రులలో ఇచ్చే మందులే ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఉచితంగా ఇస్తారని ఆయన బాధితులకు సూచించారు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లడం వల్ల ఆర్థికంగా కంగిపోవటం తప్ప ఎలాంటి ప్రయోజనం లేదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల పీహెచ్సీ డాక్టర్ దివిజ వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.










