ప్రజాశక్తి-హెల్త్ యూనివర్శిటీ: కిడ్నీ సమస్యలను ప్రాథమిక దశలో గుర్తించి తగిన చికిత్స పొందే విధంగా ప్రజల్లో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు. అంతర్జాతీయ కిడ్నీ దినోత్సవ సందర్భంగా నగరంలోని సిద్ధార్థ వైద్య కళాశాలలో గురువారం నిర్వహించిన అవగాహనా సదస్సులో కలెక్టర్ మాట్లాడుతూ రక్తపోటును నివారించడంలో కిడ్నీలు ముఖ్యపాత్ర వహిస్తాయన్నారు. సహజంగా అధిక రక్తపోటు, మధుమోహం వంటి దీర్ఘకాల వ్యాధులు ఊబకాయం, మద్యపానం, ధూమపానం, మత్తుపదార్ధాల సేవించడం కారణంగా మూత్రపిండాలు దెబ్బతినే అవకాశం ఉంటుందన్నారు. కిడ్నీలు దెబ్బతిన్నాయనే దానికి తరచు కాళ్ల వాపులు వచ్చి తగ్గడం, కండరాల నొప్పులు, శరీరంలో నీరు చేరడం, ఆకలి మందగించడం వంటివి ప్రాథమిక లక్షణాలు గుర్తించి ఉంటాయన్నారు. వైద్య విద్య రాష్ట్ర సంచాలకులు డాక్టర్ వి.వినోద్‌కుమార్ మాట్లాడుతూ ద్రవాల సమతుల్యానికి విష పదార్థాలను తొలగించేందుకు, రక్తాన్ని వడకొట్టి మూత్రం ద్వారా శరీరంలోని వ్యర్థాలను తొలగించేందుకు, అధిక రక్తపొటు నివారణకు మానవ శరీరంలోని కిడ్నీలు ఎంతో దోహదపడతాయన్నారు. కిడ్నీలు దెబ్బతింటే మానవ ఆరోగ్య మనుగడకే ప్రమాదమన్నారు. కిడ్నీల ఆరోగ్య సంరక్షణపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డా. కె.సుధాకర్, హెచ్‌వోడి పి వెంకటకృష్ణ, ఆర్‌ఎంవో డాక్టర్ శోభారాణి, నెప్రాలజీ విభాగానికి చెందిన డాక్టర్ సిహెచ్ నాగేశ్వరరావు, డాక్టర్ విజేష్‌వర్మ పాల్గొన్నారు.










