Jul 23,2023 22:03

మాట్లాడుతున్న రాజు

ప్రజాశక్తి- కవిటి: ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలని, దానికోసం జనసేన పార్టీ అహారం శ్రమిస్తుందని ఇచ్ఛాపురం నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జి దాసరి రాజు అన్నారు. ఈ సందర్భంగా ఉద్ధానం కిడ్నీ సమస్య శాశ్వత పరిష్కారానికి జనసేన ఆధ్వర్యాన చేపట్టిన లక్ష సంతకాల సేకరణ ఆదివారం చేపట్టామని అన్నారు. మండలంలోని బి.గొనపపుట్టుగ పంచాయతీ తుంగానపుట్టుగ, చెవిటిపుట్టుగ, కొర్రాయి పుట్టుగ, బెవరపుట్టుగ, బాలాజీపుట్టుగ, పర్రిపుట్టుగ, బంజు పుట్టుగ, లొట్టుపుట్టుగ, తడకపుట్టుగ, గొనపపుట్టుగ గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి 1,800 సంతకాలు సేకరించినట్లు తెలిపారు. చిత్తశుద్ధితో పనిచేస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుందని, దాన్ని జనసేన చేసి చూపిస్తుందని అన్నారు. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ మహమ్మారిని తరమడమే లక్ష్యంగా జనసేన పని చేస్తుందన్నారు. గతంలో తమ నాయకుడు వచ్చిన తర్వాతే ఉద్దానం ప్రాంతంపైన, అందులో కిడ్నీ బాధితులపై స్థానిక నాయకులకు ప్రేమ పుట్టుకొచ్చిందని అన్నారు. కార్యక్రమంలో జనసేన రాష్ట్ర జాయింట్‌ సెక్రటరీ బైపల్లి ఈశ్వరరావు, మత్స్యకార వికాస విభాగ కార్యదర్శి నాగుల హరి బెహర, డొక్కరి ఈశ్వరరావు, రోకళ్ల భాస్కర్‌, అంగ సురేష్‌, శైలజ, దుగాన దివాకర్‌, బడగల రామకృష్ణ, లోళ్ల సాగర్‌, మనోజ్‌, దేవా, భీమారావు, రమణ, శివ, చందు, వల్లభ, సతీష్‌, రమణమూర్తి, నవీన్‌ పాల్గొన్నారు.