
ప్రజాశక్తి- పలాస : పలాస- కాశీబుగ్గ మున్సిపాలిటీ పద్మనాభపురం సమీపంలో రూ.50 కోట్లతో నిర్మించిన 200 పడకల ఆస్పత్రితో పాటు కిడ్నీ పరిశోధన కేంద్రాన్ని పశుసంవర్థకశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు వైద్యులతో కలసి శనివారంపరిశీలించారు. మంత్రిని ఆస్పత్రిలోని ప్రతి విభాగాన్నీ వైద్యులకు చూపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాదయాత్ర సందర్భంగా జగన్మోహనరెడ్డి ఉద్దాన కిడ్నీ రోగులకు ఇచ్చిన హామీని ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నిలబెట్టుకున్నారని గుర్తు చేశారు. కరోనా సమయంలో రెండేళ్లు పనులు నిలిచిపోయినా, ఆస్పత్రి పూర్తి చేసేందుకు అనేక ఇబ్బందులు వచ్చినా వాటిని ఎదుర్కొన్నానని పేర్కొన్నారు. అనేక బాలరిష్టాలు అధిగమించి ఈ నెల 23న ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నహాలు చేస్తున్నానని తెలిపారు. జిల్లాలో వన్నె తెచ్చే విధంగా కిడ్నీ ఆస్పత్రి సేవలు రోగులకు ఉంటాయని అన్నారు. ఈయన వెంట పలాస-కాశీబుగ్గలకు చెందిన వైద్యులు మల్లేశ్వరరావు, రాజకుమార్, భీమారావు, బాలకృష్ణ, పొందల జగదీష్, కృష్ణమూర్తి, ఎఎంసి చైర్మన్ పి.వి.సతీష్, జిల్లా వైసిపి ప్రధాన కార్యదర్శి పాలిన శ్రీనివాసరావు, పలాస కాశీబుగ్గ మున్సిపల్ మాజీ చైర్మన్ కోత పూర్ణచంద్రరావు, పలాస ప్రభుత్వాస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ డబ్బీరు భవానీశంకర్, వైసిపి నాయకులు అంబటి ఆనందరావు, లక్ష్మణ్, రోణంకి శ్రీనివాసరావు, హనుమంతు రామ్మోహనదొర, అల్లు వెంకటరమణ, కొర్రాయి శ్రీకాంత్, కృష్ణలు పాల్గొన్నారు.