ప్రజాశక్తి -మధురవాడ : కిడ్నీ బాధితుడు జి.వినరుకుమార్‌కు మెరుగైన వైద్యం చేయించాలని, కిడ్నీ దొంగల ముఠాపై కఠిన చర్యలు తీసుకోవాలని జివిఎంసి 78వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ బి.గంగారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం వాంబేకాలనీలో కిడ్నీ బాధితుడి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎటువంటి గుర్తింపూ, అనుమతులు లేకుండా కొంత మంది ముఠాగా ఏర్పడి పేదలను లక్ష్యం చేసుకునికొన్ని ఆసుపత్రులు ఏర్పాటుచేసి అవయవాలను అపహరిస్తున్నారని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కిడ్నీ బాధితుడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడని, వెంటనే అతనికి మెరుగైన వైద్యం చేయించాలని కోరారు. వినరు కుమార్ మంచాన పడటంతో అతని కుటుంబానికి పూట గడవటం కష్టంగా మారిందని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. కెజిహెచ్ సూపరింటెండెంట్‌తో గంగారావు ఫోన్‌లో మాట్లాడి వినరుకుమార్‌ను ఆసుపత్రిలో చేర్చుకొని ఆరోగ్యం కుదుటపడే విధంగా అత్యాధునిక వైద్యం చేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జోన్ నాయకులు పి.రాజుకుమార్, సిహెచ్.శేషుబాబు, జి.కిరణ్, రాము, సిపిఎం నాయకులు డి.అప్పలరాజు, గోవిందు పాల్గొన్నారు.










