Nov 08,2023 23:23

సిఎం సభా స్థలాన్ని పరిశీలిస్తున్న మంత్రి, కలెక్టర్‌, ఎస్‌పి

* పశుసంర్థకశాఖ మంత్రి అప్పలరాజు
ప్రజాశక్తి- పలాస :
 పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పద్మనాభపురం వద్ద రూ.50 కోట్లతో నిర్మిస్తున్న 200 పడకల ఆస్పత్రితో పాటు, కిడ్నీ పరిశోధన కేంద్రం పనులు వేగవంతం చేసి ఈ నెల 23న ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహనరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని మత్స్య, పశుసంవర్థకశాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు ఆదేశించారు. కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌, ఎస్‌పి జి.ఆర్‌.రాధిక, జాయింట్‌ కలెక్టర్‌ నవీన్‌తో కలసి చేపడుతున్న ఆస్పత్రి పనులను బుధవారం పరిశీలించారు. ముందుకుగా ముఖ్యమంత్రి హెలీక్యాపర్టర్‌ ల్యాండింగ్‌ ప్రాంతం కోసం కాశీబుగ్గ డిఎస్‌పి కార్యాలయం ఎదురుగా ఉన్న పోలీసు మైదానాన్ని పరిశీలించారు. అలాగే సభ స్థలం కోసం పలాస ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడా మైదానం, పారిశ్రామికవాడ ఎదురుగా ఉన్న స్థలం, పలాస రైల్వే క్రీడామైదానం స్థలాలను పరిశీలిం చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్ప టికే 90 శాతం పనులు పూర్తి అయ్యాయని, మరో పది శాతం పనులు ప్రారంభోత్సవానికి ముందే పూర్తి అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్దాన ప్రాంత రోగులకు ఈ ఆస్పత్రి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. కార్యక్రమంలో ఆర్‌డిఒ భరత్‌నాయక్‌, కాశీబుగ్గ డిఎస్‌పి నాగేశ్వరరెడ్డి, తహశీల్దార్‌ మధుసూదనరావు, ఆర్‌ఐ నిరంజనరావు, పలాస మున్సిపల్‌ కమిషనర్‌ నాగేంద్రకుమార్‌, విఆర్‌ఒ ఖగేశ్వరరావు, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ బోర కృష్ణారావు, వైసిపి జిల్లా కార్యదర్శి పాలిన శ్రీనివాసరావు, మందన ఎంపిపి దానయ్య, నాయకులు దున్న సత్యం, గౌరీ త్యాడి, టి.శాంతారావులు పాల్గొన్నారు.