ప్రజాశక్తి -పిఎం పాలెం : కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొమ్మాది గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం కెవిపిఎస్ జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు సియ్యద్రి పైడితల్లి జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఆత్మగౌరవం, సమానత్వం, కులనిర్మూలన కోసం 1998 అక్టోబర్ 2న కెవిపిఎస్‌ను స్థాపించినట్లు తెలిపారు. 7వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సంఘం ఏర్పడినప్పటి నుంచి దళితుల హక్కుల కోసం అనేక పోరాటాలు నిర్వహించిందని చెప్పారు. ఇంకా దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడాల్సి ఉందన్నారు. బిజెపి అధికారం చేపట్టినప్పటి నుంచి దళితులు, మహిళలపై తీవ్ర దాడులు జరిగాయన్నారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని లేకుండా చేయాలని మనువాదుల ఆలోచనగా ఉందని ఆరోపించారు. మన హక్కుల రక్షణ కోసం జరిగే పోరాటంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జోన్ అధ్యక్షులు డి.అప్పలరాజు, కెవిపిఎస్ కార్యకర్తలు యు.తాత, పి.కృష్ణ, ఆర్.తాతారావు, ఆదిలక్ష్మి, జట్లయ్య తదితరులు పాల్గొన్నారు.










