Jul 18,2023 00:01

నినాదాలు చేస్తున్న కెవిపిఎస్‌, పలు సంఘాల నేతలు

ప్రజాశక్తి-నర్సీపట్నంటౌన్‌: రోలుగుంట మండలం తహసీల్దార్‌ పై జాయింట్‌ కలెక్టర్‌ విచారణ చేపట్టాలని కెవిపిఎస్‌ ఆధ్వర్యంలో స్థానిక ఆర్డిఓ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వంటావార్పు కార్యక్రమాన్ని చేశారు. ఈ సందర్భంగా కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి ఈరెల్లి చిరంజీవి మాట్లాడుతూ, రోలుగుంట మండంలో అనేక రెవెన్యూ అవకతవకలు జరిగాయని, వీటిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ప్రశ్నించిన వారిని రెవెన్యూ అధికారులు బెదిరిస్తున్నారన్నారు. నర్సీపట్నం రెవిన్యూ డివిజన్‌ పరిధిలోని రోలుగుంట మండలం రత్నంపేట పంచాయతీ పనసలపాడు రెవెన్యూ పరిధిలో జగనన్న రీ సర్వేలో సాగులో ఉన్నవారిని, లేనట్టు గానూ, సాగులో లేని స్థానికేతరులను, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారస్తులను సాగులో ఉన్నట్టుగా చూపించి రికార్డ్‌లు తయారు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోలుగుంట తహసీల్దారిపై సమగ్రమైన విచారణ చేపట్టాలని గత రెండు నెలలుగా స్థానిక గిరిజనులు, దళితులు అనేక మార్లు ఆందోళన చేసినా అధికారులు పట్టించుకోలేదన్నారు. రెవిన్యూ అధికారులు సాగులో లేని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారస్తులతో కుమ్మక్కై దళితులకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. నిరసనలు మీడియాలో వచ్చినంత మాత్రాన ఒరిగేది ఏమీ లేదన్నట్లుగా తహసిల్దార్‌ భావిస్తున్నారని దుయ్యబట్టారు. వాస్తవానికి. సర్వే నెంబర్‌ 2,3,4,6,7,8,11లలో 25 ఎకరాలు భూమిని దళితులు, గిరిజనులు సాగు చేస్తున్నారని, అటువంటి భూమిని సాగులో లేనట్టు రికార్డ్‌ చేయడం అన్యాయమన్నారు. తక్షణమే సమగ్రమైన దర్యాప్తు చేసి వాస్తవాన్ని గుర్తించి రికార్డులో నమోదు చేయాలన్నారు. వంటావార్పు చేపట్టి ఆర్డీవోకు వినతి పత్రాన్ని అందించారు. గిరిజనులకు న్యాయం చేస్తానని ఆర్డిఓ జయరాం హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కే.గోవిందరావు, రత్నంపేట మాజీ ఎంపీటీసీ సభ్యులు దుర్గబాబు, దళిత సంఘం నాయకులు చిలుకు, గేమిలి చిన్నబ్బాయి తదితరులు పాల్గొన్నారు.