
ప్రజాశక్తి-దత్తిరాజేరు : చిన్నచామలాపల్లి కొండపై ప్రభుత్వం ప్రతిపాదించిన కృషి విజ్ఞాన కేంద్రం నిర్మాణం వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రస్థాయి ఉద్యమం చేపడతామని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ హెచ్చరించారు. శుక్రవారం పెదమానాపురం సంతతోటలో ఏర్పాటు వేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ గ్రామంలో నివశిస్తున్న 150 కుటుంబాలకు 50 ఎకరాల విస్తీర్ణంలోని కొండ మాత్రమే జీవనాధారమని తెలిపారు. ఈ కొండపై నిర్మాణం చేపడితే గ్రామస్తులతోపాటు మూగజీవాలపైనా దాడి చేసినట్లేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 559/1996 చట్టం ప్రకారం గొర్రెలు, మేకల పెంపకందారులు నివాసం ఉన్నచోట ఖాళీ భూములు ఉంటే వాటికి వారే హక్కుదారులని స్పష్టంచేశారు. నెల క్రితం గ్రామస్తులతో వెళ్లి జిల్లా కలెక్టరుకు అక్కడ భౌగోళిక పరిస్థితులు వివరించామని చెప్పారు. స్పందించిన అధికారులు కృషి విజ్ఞాన కేంద్రం నిర్మాణంపై పునరాలోచన చేస్తామని చెప్పి నాలుగు రోజుల క్రితం ఆర్‌డిఒను పంపించి భూసేకరణ పనులు ముమ్మరం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజాప్రాయ సేకరణ పెట్టి సభ ద్వారా 70 శాతం ప్రజల ఆమోదం ఉంటేనే భూసేకరణ చేపట్టాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. ఇలాంటి విజ్ఞాన కేంద్రాలు, ఫ్యాక్టరీలు పేరిట రైతుల వద్ద నుంచి దౌర్జన్యంగా భూములు లాక్కొని ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా ఖాళీగా వదిలేసిన సందర్భాలు అనేకం ఉన్నాయని తెలిపారు. 2007లో బొడ్డవరం దగ్గర కొన్ని భూములు ప్రభుత్వం లాక్కొందని, ఇప్పటికీ అలాగే ఉండిపోయాయని ఉదహరించారు. కెవికె నిర్మాణం ఉపసంహరించుకోకపోతే నవంబర్ రెండో తేది నుంచి ఇంగిలాపల్లి సచివాలయం ముందు రిలే నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. అప్పటికీ ప్రభుత్వం ముందుకు వెళితే అన్ని జిల్లాల నుంచి పెంపకందారులను కదిలించి రాష్ట్రస్థాయి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి జి శ్రీనివాసరావు, పెంపకందారుల సంఘం నాయకులు మన్యాల ఎరుకునాయుడు, జి.తిరుపతి పాల్గొన్నారు.