చాపాడు : జిల్లాలోనే అధికంగా వ్యవసాయానికి సాగునీరు అందించే ప్రాజెక్ట్‌లలో కెసి కెనాల్ ప్రధానమైనది. జిల్లాలో సుమారుగా 92వేల ఎకరాలకు కెసి కెనాల్ పరిధిలో సాగునీరు అందే అవకాశం ఉంది. కాలువల నిర్వహణ సరిగా లేకపోవడంతో పూర్తిస్థాయిలో వ్యవసాయానికి నీరు అందడం లేదన్న విమర్శలు వెలువడుతున్నాయి. చివరి ఆయకట్టుకు సాగు నీరు అందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నంద్యాల జిల్లా చాగలమర్రి మండల పరిధిలో రాజోలి ఆనకట్ట వద్ద నుండి జిల్లాలోని దువ్వూరు, మైదుకూరు, చాపాడు, ప్రొద్దుటూరు మండల పరిధిలోని రాజుపాలెంతోపాటు చెన్నూరు, కడప మండలాల్లో కెసి కాలువకు నీరు పంటపొలాలకు అందుతోంది. కెసి కాలువ వెంబడి కంప చెట్లు విపరీతంగా పెరిగి కాలువ బలహీనపడింది. కొన్ని ప్రదేశాలలో సిమెంట్ లైనింగ్‌లు దెబ్బతిని కాలువ కోతకు గురవుతోంది. కెసి కాలువలో పూడికతీత పనులను ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతుండటంతో ఎక్కువ ప్రాంతాల్లో పూడికతీత సమస్య మాత్రం కనిపించడం లేదు. ఏటూరు కాలువలో ఉపాధి పనులు చేపట్టారు. మైదుకూరు మునిసిపాలిటీ పరిధిలో మాత్రం పూడిక సమస్య కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం షెటర్లు లేకపోవడంతో నీరు వృథాగా పోతోంది. మైదుకూరు నుండి కొండపేట కాలువలో ఆకులు, అలములు అధికంగా ఉండడంతో నీటి ప్రవాహానికి ఇబ్బందికరంగా ఉంది. పట్టణ పరిధిలో ఉన్న కాలువలలో వ్యర్థ పదార్థాలు వేస్తుండడంతో రైతులకు ఇబ్బందికరంగా ఉంది. చాపాడు ఛానల్ ద్వారా చివరి ఆయకట్టుకు కాలువలలో వ్యర్ధపదార్ధాలు లైనింగ్ పనులు దెబ్బతినడంతో నీటిప్రవాహం సజావుగా సాగడం లేదు. కెసి కెనాల్ కాలువలను పరిరక్షించే సిబ్బంది కొరత అధికంగా ఉండటంతో అక్రమ నీటి వాడకం, నీటి వృథా జరుగుతోంది. ఆగస్టు మొదటివారంలో కెసి కాలువకు నీరు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి కెసి కాలువలో అవసరమైన చోట్ల మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
చివరి ఆయకట్టుకు అందని నీరు
కెసి ప్రధాన కాలువకు నీరు ప్రతి సంవత్సరం విడుదలవుతున్నప్పటికీ చివరి ఆయకట్టుకు నీరు అందడం లేదు. ఉప కాలువలు అధ్వానంగా తయారయ్యాయి. చాపాడు ఛానల్ నుంచి ఖాదరపల్లె, చాపాడుకు వచ్చే కాలువ డ్రెయినేజీ నీటితో పూర్తిగా నిండిపోయినది. ఈ కాలువలలో పూడికతీత పనులు చేపట్టి చివరి ఆయకట్టకు నీరు అందేలా చూడాలి.
- మస్తాన్, రైతు, చాపాడు.
కాలువల నిర్వహణపై పర్యవేక్షణ పెంచాలి
కెసి కాలువ నీటి ఆధారంగా వరి పంటను సాగు చేపడతాం. తూముల వద్ద షెట్టర్ల నిర్వహణపై సరైన పరిరక్షణ లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కొన్ని సందర్భాల్లో నీరు అధికంగా రావడం, అవసరమైన సందర్భంలో నీరు తక్కువ రావడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. షెటర్‌ల పర్యవేక్షణకు నిరంతరం సిబ్బంది పర్యవేక్షణ ఉండాలి.
- ఆంజనేయులు, రైతు, సిద్ధారెడ్డిపల్లి.
రూ.3.38 కోట్లతో కెసి అభివృద్ధి
కెసి కాలువలో మరమ్మతు పనులు, ఉపకాల్వలలో సిమెంట్ లైనింగ్ తదితర అభివృద్ధి పనులను రూ.3.38 కోట్లతో చేపట్టేందుకు చర్యలు జరుగుతున్నాయి. చాపాడు చానల్, ఏటూరు కాలువ పరిధిలో కెసి కాలువ దెబ్బతిన్న ప్రాంతాలలో మరమ్మతు పనులు చేపట్టేందుకు నిధులు మంజూరయ్యాయి. ఉప కాలువలలో సిమెంట్ లైనింగ్ ఏర్పాటుకు టెండర్లు కూడా పూర్తయి కొన్ని పనులు ప్రారంభమైనాయి. ప్రస్తుతం ఉపాధి హామీ పథకం ద్వారా పూడికతీత, కట్టల మీద కంపచెట్ల తొలగింపు పనులు కొనసాగుతున్నాయి. ఆగస్టులో కెసికి నీరు వచ్చే సమయానికి కాలువలు రైతులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటాం.
- జాన్సన్, ఎఇ, కెసి కెనాల్, చాపాడు.










